ఐపీఎల్-2025 మెగా వేలంలో రిషభ్ పంత్ భారీ ధర పలకడం ఖాయమని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ఈ వికెట్ కీపర్ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమని.. లీగ్ చరిత్రలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని అంచనా వేశాడు.
రూ. 25- 28 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్నాడు
పంజాబ్ కింగ్స్ పంత్‌ను సొంతం చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించవచ్చన్న ఊతప్ప.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా పంత్ కోసం పోటీపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా పంత్ వైపు మొగ్గుచూపుతాయని అంచనా వేసిన ఊతప్ప.. ఏదేమైనా ఈసారి అతడు వేలంలో రూ. 25- 28 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్నాడని జోస్యం చెప్పాడు.
కాగా ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా గతేడాది ఐపీఎల్‌కు దూరమైన పంత్.. కోలుకున్న తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్-2024లో 446 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్.. సారథిగా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పంత్ కెప్టెన్సీ ఢిల్లీ ఈసారి పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఏడు గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.
ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంఛైజీ రిషభ్ పంత్‌ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ క్రీడా చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న భారత దిగ్గజం సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి తీసుకునే అవకాశముందని సూచనప్రాయంగా వెల్లడించాడు. ‘ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తిగా భిన్నమైంది. అది ఎలా సాగుతుందో ఎవరూ చెప్పలేరు. ఊహించలేరు.
కానీ నా అంచనా ప్రకారం పంత్‌ను ఢిల్లీ మళ్లీ తమ జట్టులోకి తీసుకోవచ్చు. ఆటగాళ్ల రిటెన్షన్ అనేది సదరు ప్లేయర్‌కు, ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన వ్యవహారం. తాను ఆశించినంత ధర రాకపోతే ఆ ఆటగాడు... తాము చెల్లించే ధరకు ఆడకపోతే ఫ్రాంచైజీ నిర్ణయాలకు విభేదించే జట్లను వీడతారు.
పంత్ విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందని నేను భావిస్తున్నా. రిటెన్షన్ కుదరకపోయినా... పంత్‌లాంటి కెప్టెన్ అవసరం ఢిల్లీకే ఉంది. అతను లేకపోతే ఫ్రాంచైజీ కొత్త సారథి వేటలో పడాలి. నా అంచనా ప్రకారం ఢిల్లీ కచ్చితంగా పంత్‌ను తీసుకుంటుంది’ అని అభిప్రాయపడ్డారు.
అయితే, పంత్ మాత్రం గావస్కర్ వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. ఢిల్లీతో కొనసాగకపోవడానికి డబ్బు మాత్రం కారణం కానే కాదని పంత్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. పంత్ మెగా వేలానికి అందుబాటులోకి రావడంతో ఫ్రాంచైజీలన్నీ అతడిపై కన్నేశాయి.
రూ.24.75 కో ట్లతో రికార్డు
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు రాబిన్ ఊతప్ప సహా ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు పంత్‌కు ఈసారి కళ్లు చెదిరే మొత్తం దక్కుతుందని.. పంజాబ్ కింగ్స్ పంత్‌ను దక్కించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2024 మినీ వేలంలో అతడి కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లు వెచ్చించింది. ఈ క్రమంలో సీజన్ ఆరంభంలో నిరాశపరిచినా.. ఆ తర్వాత విజృంభించిన స్టార్క్.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.
అయితే, మెగా వేలానికి ముందు కోల్‌కతా స్టార్క్‌తో పాటు తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను విడుదల చేసింది. ఇక పంత్‌తో పాటు అయ్యర్, కేఎల్ రాహుల్ రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలో తమ పేరు నమోదు చేసుకున్నారు. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment