‘ఈసారి విజేతగా ఆ జట్టే.. సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరడం కష్టమే’ | IPL 2025: Michael Vaughan Rates All 10 Teams Predicts Winner | Sakshi
Sakshi News home page

IPL 2025: ఈసారి విజేతగా ఆ జట్టే.. సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరడం కష్టమే: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

Published Thu, Mar 20 2025 3:37 PM | Last Updated on Thu, Mar 20 2025 5:25 PM

IPL 2025: Michael Vaughan Rates All 10 Teams Predicts Winner

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా క్రికెట్‌ టోర్నీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) వినోదం పంచేందుకు సిద్ధమైంది. రెండు నెలలకు పైగా నిర్విరామంగా క్రికెట్‌ ప్రేమికులకు పొట్టి క్రికెట్‌ మజా అందించనుంది. ఐపీఎల్‌-2025 మార్చి 22న మొదలై.. మే 25న ఫైనల్‌తో ముగియనుంది.

గతేడాది.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad), రాజస్తాన్‌ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో వరుసగా ఒకటి నుంచి పది స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే.

పది జట్లలో భారీ మార్పులు
వీటిలో కోల్‌కతా- హైదరాబాద్‌ ఫైనల్లో తలపడగా.. రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. ఇక ఏడాది ఈ పది జట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మెగా వేలం-2025 నేపథ్యంలో ఐదు జట్ల కెప్టెన్లూ మారారు. 

లక్నోకు రిషభ్‌ పంత్‌, పంజాబ్‌కు శ్రేయస్‌ అయ్యర్‌, ఢిల్లీకి అక్షర్‌ పటేల్‌, బెంగళూరుకు రజత్‌ పాటిదార్‌, కోల్‌కతాకు అజింక్య రహానే సారథులుగా నియమితులయ్యారు.

అత్యధికంగా పదికి 9 పాయింట్లు
ఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ఐపీఎల్‌-2025లో పది జట్లకు తనదైన శైలిలో రేటింగ్‌ ఇచ్చాడు. అదే విధంగా.. ప్లే ఆఫ్స్‌ చేరే జట్లు, విజేతపై తన అంచనా తెలియజేశాడు. గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు అత్యధికంగా పదికి 9 పాయింట్లు ఇచ్చిన మైకేల్‌ వాన్‌.. అతి తక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు 5 పాయింట్లు వేశాడు.

అయితే, గతేడాది పేలవ ప్రదర్శన కనబరిచిన పంజాబ్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఏడేసి పాయింట్లు ఇవ్వడం విశేషం. ఇక 2024లో పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఏకంగా 7.5 రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం. అన్ని జట్ల కంటే ఈసారి గుజరాత్‌ టైటాన్స్‌ గొప్పగా ఉందన్న మైకేల్‌ వాన్‌.. ఆ జట్టును తొమ్మిది పాయింట్లతో టాప్‌లో నిలిపాడు.

ఇక గతేడాది ఫైనలిస్టు అయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు 6.5 పాయింట్లే ఇచ్చిన వాన్‌.. ఈసారి ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డాడు. నాలుగో స్థానం కోసం ఎస్‌ఆర్‌హెచ్‌.. పంజాబ్‌, లక్నోలతో పోటీ పడుతుందని అంచనా వేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్‌ చాంపియన్‌గా నిలవడం ఖాయమని వాన్‌ జోస్యం చెప్పాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

ఐపీఎల్‌-2025 జట్లకు మైకేల్‌ వాన్‌ ఇచ్చిన రేటింగ్‌(పది పాయింట్లకు)
👉గుజరాత్‌ టైటాన్స్‌- 9
👉కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- 8
👉లక్నో సూపర్‌ జెయింట్స్‌- 7
👉పంజాబ్‌ కింగ్స్‌- 7
👉సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 6.5
👉రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- 6.5
👉రాజస్తాన్‌ రాయల్స్‌- 6.5
👉చెన్నై సూపర్‌ కింగ్స్‌- 6
👉ఢిల్లీ ‍క్యాపిటల్స్‌- 5.

మైకేల్‌ వాన్‌ ఎంచుకున్న టాప్‌-4 జట్లు(ప్లే ఆఫ్స్‌)
గుజరాత్‌, కోల్‌కతా, ముంబై ఇండియన్స్‌ టాప్‌-3లో ఉండగా.. నాలుగో స్థానం కోసం లక్నో, పంజాబ్‌, సన్‌రైజర్స్‌ పోటీ.

విజేతపై మైకేల్‌ వాన్‌ అంచనా
ఈసారి ముంబై ఇండియన్స్‌ ట్రోఫీ గెలిచే అవకాశం.

చదవండి: CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement