భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ తర్వాత ఆర్సీబీ (RCB) వెన్నులో వణుకు మొదలైంది. ఈ సిరీస్‌లో ఆర్సీబీకి చెందిన ఇంగ్లండ్ ఆటగాళ్లు (England Players) దారుణంగా విఫలం కావడమే ఇందుకు కారణం. ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ (Phil Salt), లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone), జేకబ్ బేతెల్‌ను (Jacob Bethell) ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఈ ముగ్గురు తాజాగా ముగిసిన సిరీస్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక చతికిలపడ్డారు.
రూ. 11.50 కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఫిల్ సాల్ట్ చివరి టీ20 మినహా సిరీస్ మొత్తంలో విఫలమయ్యాడు. రూ. 8.75 కోట్ల ధర పలికిన లియామ్ లివింగ్‌స్టోన్ ఒక్క మూడో టీ20లో మాత్రమే కాస్త పర్వాలేదనిపించాడు. రూ. 2.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన జేకబ్ బేతెల్ సిరీస్ మొత్తంలో ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించలేక తస్సుమనిపించాడు.
భారీ అంచనాలతో కొనుగోలు చేసిన తమ ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో ఆర్సీబీ యాజమాన్యానికి గుబులు పుట్టుకుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి (మెగా వేలంలో) తప్పు చేశామా అని ఆత్మపరిశీలన చేసుకుంటుంది. మరోవైపు ఇంగ్లండ్ విధ్వంసకర వీరుల త్రయం తమ ఫేట్‌ను మారుస్తుందని ఆర్సీబీ అభిమానులు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇంగ్లండ్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనల తర్వాత వారి అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి. 'ఈ సాలా కప్ నమ్మదే' అంటూ ప్రతి యేడు డప్పు కొట్టుకునే ఆర్సీబీ అభిమానులకు 2025 సీజన్ ప్రారంభానికి ముందే తమ భవిష్యత్తు అర్దమైపోయింది. ఐపీఎల్ ప్రారంభానికి మరో నెలన్నర రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ మధ్యలో ఆర్సీబీకి చెందిన ఇంగ్లండ్ బ్యాటింగ్ త్రయం టీ20లు ఆడేది లేదు. మరి ఐపీఎల్ బరిలోకి నేరుగా దిగి వీరేమి చేస్తారో వేచి చూడాలి.
కాగా, భారత్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 1-4 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ మొత్తంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమయ్యారు. ఈ సిరీస్‌లోని మూడో టీ20లో మాత్రమే ఇంగ్లండ్ విజయం సాధించగలిగింది. ఆ మ్యాచ్‌లోనూ భారత ఆటగాళ్ల స్వయంకృతాపరాధాల వల్లే ఇంగ్లండ్ గెలవగలిగింది.
ఈ సిరీస్‌లో భారత ప్రదర్శన విషయానికొస్తే.. భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ వీరలెవెల్లో విజృంభించగా.. బౌలింగ్‌లో వరుణ్ చక్రవరి అంచనాలకు మించి రాణించాడు. ఈ సిరీస్‌లో లీడింగ్ రన్ స్కోరర్.. లీడింగ్ వికెట్ టేకర్లు వీరిద్దరే.
చివరి టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసకర శతకం బాదిన అభిషేక్.. ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 219.69 స్ట్రయిక్‌రేట్‌తో 276 పరుగులు చేశాడు. వరుణ్ ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment