IPL 2025: ఏంటి.. రియాన్‌ పరాగ్‌కు కూడా కాళ్లు మొక్కే ఫ్యాన్స్‌ ఉన్నారా..? | IPL 2025 RR VS KKR: Fan Came Into Ground And Touched Riyan Parag Feet | Sakshi
Sakshi News home page

IPL 2025: ఏంటి.. రియాన్‌ పరాగ్‌కు కూడా కాళ్లు మొక్కే ఫ్యాన్స్‌ ఉన్నారా..?

Published Thu, Mar 27 2025 1:29 PM | Last Updated on Thu, Mar 27 2025 3:10 PM

IPL 2025 RR VS KKR: Fan Came Into Ground And Touched Riyan Parag Feet

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (మార్చి 26) రాజస్థాన్‌ రాయల్స్‌, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌ రాయల్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమై అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌ ఇదే. 

ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్‌ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్‌ డికాక్‌ 61 బంతుల్లో 97 పరుగులు చేసి ఒంటిచేత్తో కేకేఆర్‌ను గెలిపించాడు. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో భంగపడ్డ కేకేఆర్‌ ఈ మ్యాచ్‌లో గెలుపుతో విజయాల ఖాతా తెరిచింది. ఈ సీజన్‌లో రాయల్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.

కాగా, చప్పగా సాగుతున్న నిన్నటి మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అమాంతం మైదానంలోకి దూసుకొచ్చి బౌలింగ్‌ చేస్తున్న రియాన్‌ పరాగ్‌ కాళ్లపై పడ్డాడు. ఆ తర్వాత రియాన్‌ను కౌగిలించుకున్నాడు. ఈలోపు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ పిచ్‌ ఇన్‌వేడర్‌ను లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

ఇది చూసి జనాలు రియాన్‌కు కూడా కాళ్లు మొక్కే ఫ్యాన్స్‌ ఉన్నారా అని కామెంట్లు చేస్తున్నారు. రియానే ఆ వ్యక్తికి డబ్బిచ్చి అలా చేయమని ఉంటాడని మరికొందరంటున్నారు. రియాన్‌ కాళ్లు మొక్కి జైలుకి (మ్యాచ్‌ జరిగే సమయంలో మైదానంలోకి వస్తే జరిమానా, జైలు శిక్ష లేదా స్టేడియం నుంచి బహిష్కరణ లాంటి శిక్షలు వేస్తారు) వెళ్లే సాహసం ఎవరు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరేమో రియాన్‌ లోకల్‌ హీరో  కాబట్టి ఫ్యాన్స్‌ ఉండటంలో తప్పేముందని అంటున్నారు. రియాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌ కూడా అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

సోషల్‌మీడియాలో ఎలాంటి కామెంట్లు వస్తున్నా.. రియాన్‌ రాయల్స్‌కు స్టార్‌ ఆటగాడు. పైగా అతను జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. రియాన్‌ పుట్టి పెరిగింది కూడా నిన్న మ్యాచ్‌ జరిగిన గౌహతిలోనే. జాతీయ స్థాయిలో, ఐపీఎల్‌లో ఆ రాష్ట్రానికి (అసోం) ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడు అతనే. అలాంటప్పుడు అతనికి ఫ్యాన్స్‌ ఉంటే తప్పేముంది. సోషల్‌మీడియా యూజర్స్‌కు నచ్చినా నచ్చకపోయినా రియాన్‌ ఓ స్టార్‌ ఆల్‌రౌండర్‌. అతనిలో ఎంత టాలెంట్‌ లేకుంటే అతన్ని రాయల్స్‌ గత సీజన్‌కు ముందు రిటైన్‌ చేసుకుంటుంది..? అంత మంది సీనియర్లు ఉన్నా అతన్నే ఎందుకు కెప్టెన్‌ చేస్తుంది..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement