గుజరాత్ టైటాన్స్ జట్టు (PC: GT X)
ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. నవంబరు చివరి వారంలో ఆక్షన్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. అదే విధంగా.. వేలానికి ముందు పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబరు 31లోపు సమర్పించాలని డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌కు సంబంధించిన ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని విడిచిపెట్టాలని ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను కొనసాగించడంతో పాటు అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కూడా టైటాన్స్ రిటైన్ చేసుకోనుందట!
పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానం
కాగా 2022లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్‌లోనే చాంపియన్‌గా నిలిచింది. మరుసటి ఏడాది రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది. అయితే, ఆ రెండు దఫాల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జట్టును వీడి.. ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఈ క్రమంలో హార్దిక్ స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పగించింది.
అయితే, ఐపీఎల్-2024లో గిల్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. గాయం కారణంగా షమీ సీజన్ మొత్తానికి దూరం కావడం.. కొన్ని మ్యాచ్‌లలో ఆఖరి వరకు పోరాడినా ఒత్తిడిలో చిత్తు కావడం ప్రభావం చూపింది. దీంతో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
అతడికి రూ. 18 కోట్లు
అయినప్పటికీ.. టీమిండియా భవిష్య కెప్టెన్‌గా గుర్తింపు పొందిన శుబ్‌మన్ గిల్‌పై నమ్మకం ఉంచిన ఫ్రాంఛైజీ యాజమాన్యం అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించి తమ జట్టు నాయకుడిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
ఇక వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ సైతం ఈ సీజన్‌లో నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌లు ఆడి కేవలం పది వికెట్లే తీశాడు. అయినప్పటికీ రషీద్ నైపుణ్యాలపై నమ్మకంతో అతడిని కూడా రిటైన్ చేసుకోనున్నారట.
సాయి కిషోర్‌ను కూడా...
అదే విధంగా.. ఐపీఎల్-2024లో శతకం బాది.. ఓవరాల్‌గా 527 పరుగులతో సత్తా చాటిన సాయి కిషోర్‌ను కూడా టైటాన్స్ అట్టిపెట్టుకోనుందట. ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్లు షారుఖ్ ఖాన్,రాహుల్ తేవటియాలను కూడా కొనసాగించనున్నట్లు సమాచారం.
కాగా షమీ వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన అనంతరం చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దూరమైన అతడు ఇంతవరకు పునరాగమనం చేయలేదు. అందుకే టైటాన్స్ షమీని వదిలేయనున్నట్లు సమాచారం.
చదవండి: Ranji Trophy: 68 బంతుల్లోనే సెంచరీ.. ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్!
Comments
Please login to add a commentAdd a comment