
Photo Courtesy: BCCI/IPL
పదిహేడు సీజన్లు విజయంతంగా పూర్తి చేసుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరోసారి అభిమానులకు కనువిందు చేసేందుకు సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లోని అసలైన మజాను అందించేందుకు.. రెండు నెలలకు పైగా వినోదం అందించేందుకు సిద్ధంగా ఉంది. కోల్‌కతా- బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న మొదలుకానున్న ఐపీఎల్-2025 సీజన్ మే 25న ఫైనల్‌తో ముగియనుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరే జట్లు, విజేత, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలపై మాజీ క్రికెటర్లు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. ఈసారి ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అంచనా వేశాడు.
మరోవైపు.. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరతాయని సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ జోస్యం చెప్పాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ విజేతలపై తన అంచనా తెలియజేశాడు.
‘‘ఐపీఎల్ సందడి మొదలైపోయింది. మీ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విన్నర్లు ఎవరు? నేనైతే ఐపీఎల్-2025లో సాయి సుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు ఓటు వేస్తా’’ అని వసీం జాఫర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ గతేడాది గుజరాత్ టైటాన్స్‌కు ఆడాడు.
ఐపీఎల్-2024లో ఈ 23 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్.. 12 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 527 పరుగులు రాబట్టాడు. ఇందులో ఓ శతకం కూడా ఉండటం విశేషం. టైటాన్స్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలవడంతో పాటు.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.
ఈ మేర అద్భుత ప్రదర్శన కనబరిచిన చెన్నై చిన్నోడు సాయి సుదర్శన్‌ను మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 8.50 కోట్లకు రిటైన్ చేసుకుంది. మరోవైపు.. టీమిండియా టీ20 స్పెషలిస్టు, భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న అర్ష్‌దీప్ సింగ్.. గతేడాది పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు.
మొత్తంగా 14 మ్యాచ్‌లలో కలిపి 10.03 ఎకానమీ రేటుతో ఏకంగా పందొమ్మిది వికెట్లు కూల్చాడు. కానీ.. మెగా వేలానికి ముందు పంజాబ్ ఈ లెఫ్టార్మ్ పేసర్‌ను రిటైన్ చేసుకోలేదు. అయితే, వేలంపాటలో రూ. 18 కోట్ల మొత్తానికి రైట్-టు- మ్యాచ్ కార్డు (వేరే ఫ్రాంఛైజీ సొంతం చేసుకునే ముందు.. అంతే మొత్తానికి తిరిగి దక్కించుకునే అవకాశం) ఉపయోగించి మళ్లీ అతడిని తమ జట్టులో చేర్చుకుంది.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోగా.. హర్షల్ పటేల్(పంజాబ్ కింగ్స్) 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అంతకుముందు శుబ్‌మన్ గిల్(గుజరాత్ టైటాన్స్) 890 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా నిలవగా.. మహ్మద్ షమీ (గుజరాత్ టైటాన్స్) తరఫున 28 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment