
Photo Courtesy: BCCI/IPL
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కెప్టెన్‌గా రజత్ పాటిదార్ (Rajat Patidar) పేరును ప్రకటించినప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది. విరాట్ కోహ్లి వంటి దిగ్గజ ఆటగాడి నీడలో ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు తనదైన ముద్ర వేయగలడా అనే సందేహాలు తలెత్తాయి. అంతేకాదు ‘కింగ్’ మాస్ క్రేజ్ అతడికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.
డిఫెండింగ్ చాంపియన్‌పై గెలుపుతో మొదలు
అయితే, రజత్ పాటిదార్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆర్సీబీని విజయపథంలో నడిస్తున్నాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా అద్భుతంగా రాణిస్తూ జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. పాటిదార్ సారథ్యంలో సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే ఆర్సీబీ.. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను మట్టికరిపించింది.
చెన్నైని చెపాక్‌లో ఓడించి
కేకేఆర్‌ను తమ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. గెలుపుతో సీజన్‌ను ఆరంభించింది. అనంతరం.. చెన్నై సూపర్ కింగ్స్‌పై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతేకాదు.. చెన్నైకి కంచుకోట అయిన చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ 2008 తర్వాత.. మళ్లీ విజయం సాధించడం ఇదే తొలిసారి.
అయితే, తమ సొంత మైదానం ఎం. చిన్నస్వామి స్టేడియంలో మాత్రం ఆర్సీబీకి పరాభవం ఎదురైంది. హ్యాట్రిక్ విజయం అందుకోవాలన్న పాటిదార్ సేనపై గుజరాత్ టైటాన్స్ నీళ్లు చల్లింది. బెంగళూరు వేదికగా ఆర్సీబీని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, ఆర్సీబీ ఈ ఓటమి నుంచి త్వరగానే కోలుకుంది.
ముంబై కంచుకోట బద్దలు
ముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించి.. దానిని డిఫెండ్ చేసుకుంది. సొంత మైదానంలో ఈ ఫైవ్ టైమ్ చాంపియన్‌ను 12 పరుగుల తేడాతో ఓడించి మళ్లీ గెలుపు బాట పట్టింది.
ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా
ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో.. ఒకే సీజన్‌లో కేకేఆర్‌ను ఈడెన్ గార్డెన్స్‌లో, చెన్నైని చెపాక్‌లో, ముంబైని వాంఖడేలో ఓడించిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. అద్భుతమైన నాయకత్వ నైపుణ్యాలతో ఈ మూడు చాంపియన్ జట్లను వారి సొంత మైదానంలోనే ఓడించిన సారథిగా అరుదైన ఘనత సాధించాడు.
గతంలో పంజాబ్ కింగ్స్ 2012లో ఈ ఫీట్ నమోదు చేసింది. అయితే, అప్పుడు ఆ జట్టుకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు పనిచేశారు. ఆడం గిల్‌క్రిస్ట్ సారథ్యంలో పంజాబ్ కేకేఆర్‌ను ఈడెన్ గార్డెన్స్‌లో ఓడించింది. అంతకుముందు డేవిడ్ హస్సీ కెప్టెన్సీలో ముంబైని వాంఖడేలో, చెన్నైని చెపాక్‌లో చిత్తు చేసింది. అయితే, పాటిదార్ సోలోగా ఈ ఘనత సాధించి.. చరిత్ర సృష్టించాడు.
బ్యాటర్‌గానూ సూపర్‌హిట్
ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట గెలిచింది. మరోవైపు.. రజత్ పాటిదార్ ఇప్పటి వరకు నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 161 పరుగులు సాధించాడు. కేకేఆర్‌పై 16 బంతుల్లో 34, సీఎస్‌కేపై 32 బంతుల్లో 51 రన్స్ చేశాడు.
అదే విధంగా.. గుజరాత్ టైటాన్స్‌పై 12 బంతుల్లో 12, ముంబైపై 32 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. చెన్నై, ముంబైపై ఆర్సీబీ విజయాల్లో బ్యాటర్‌గా కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు కూడా!.. ఏదేమైనా పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ ఇదే జోరు కనబరిస్తే.. ‘ఈసారి కప్ మనదే’ అని ప్రతిసారీ అనుకునే అభిమానుల కల నెరవేరవచ్చు.. ఏమో గుర్రం ఎగరావచ్చు!!
A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede!
Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE— IndianPremierLeague (@IPL) April 7, 2025
చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..