ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన ఘట్టం! | KKR Retires Jersey No 12 In Tribute To Andre Russell Historic First For IPL, Read Story For Details | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన ఘట్టం!

Mar 25 2026 9:01 AM | Updated on Mar 25 2026 10:11 AM

IPL 2026: KKR retires jersey No-12 in tribute to Andre Russell

ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (కేకేఆర్‌) వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రీ ర‌స్సెల్‌కు అరుదైన గౌర‌వం క‌ల్పించింది. గ‌త సీజ‌న్‌లో ర‌స్సెల్ ఐపీఎల్‌కు వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేకేఆర్ ర‌సెల్ జెర్సీ నంబ‌ర్ 12కు కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపింది. ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి మూడు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో మంగ‌ళ‌వారం రాత్రి కేకేఆర్‌ ‘నైట్స్ అన్‌ప్ల‌గ్డ్’ పేరిట ప్రీ సీజ‌న్ ఈవెంట్‌ను నిర్వ‌హించింది. 

ఈ సంద‌ర్భంగా ర‌స్సెల్ జెర్సీ నంబ‌ర్‌కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇదే విష‌య‌మై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. ‘ర‌స్సెల్.. నీకు కేకేఆర్ ఇస్తున్న బ‌హుమానం ఇదే. నీ జెర్సీ నంబ‌ర్ 12కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్నాం. ఇక మీదట 12 జెర్సీ నంబ‌ర్ నీకే సొంతం’ అని తెలిపారు. అయితే ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒక ఫ్రాంచైజీ ఆట‌గాడి జెర్సీ నంబ‌ర్‌కు అధికారిక రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం ఇదే తొలిసారి. 

ఈ నేప‌థ్యంలో కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ర‌స్సెల్ భావోద్వేగానికి గుర‌య్యాడు. ‘దశాబ్దానికి పైగా ఈ జట్టుతో ఎన్నో విజయాలు సాధించాను. రెండు టైటిల్స్ గెలిచాం. ఆ జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు మెదిలాయి. అది చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. ప్రతి మ్యాచ్‌ను నా చివరి మ్యాచ్‌లా ఆడాను’ అని వెల్లడించాడు.

దశాబ్దానికి పైగా..
కేకేఆర్ జట్టుతో దశాబ్దానికి పైగా అనుబంధం కలిగిన రస్సెల్.. 2014, 2024 టైటిల్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కేకేఆర్ త‌ర‌ఫున ర‌స్సెల్ 2,651 ప‌రుగులు చేయ‌డంతో పాటు 123 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

గ‌తంలో స‌చిన్‌, ధోని..
ఇది వరకు భారత క్రికెట్‌లో బీసీసీఐ మాత్రమే జెర్సీ నంబర్లను రిటైర్ చేసింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10, ఎంఎస్ ధోనీ జెర్సీ నంబర్ 7లను రిటైర్ చేశారు. అయితే ఐపీఎల్‌లో ఇలాంటి నిర్ణయం ఇప్పటివరకు ఎప్పుడూ తీసుకోలేదు.  తాజా సీజన్‌కు ముందు రస్సెల్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ఆసక్తికరంగా అతను వేలంలోకి వెళ్లకుండా కేకేఆర్ ఆఫర్‌ను అంగీకరించి ‘పవర్ కోచ్’గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. ఇకపై యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టనున్నాడు.

 చదవండి: ‘ఐపీఎల్‌ మరో స్థాయికి వెళ్లిపోయింది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement