పోటీ రసవత్తరం.. ప్లేఆఫ్స్‌ రేసులో 8 జట్లు! | IPL 2026: Lucknow-Mumbai Out-8 Teams Still Have Chance Qualify Playoffs | Sakshi
Sakshi News home page

పోటీ రసవత్తరం.. ప్లేఆఫ్స్‌ రేసులో 8 జట్లు!

May 11 2026 5:15 PM | Updated on May 11 2026 6:07 PM

IPL 2026: Lucknow-Mumbai Out-8 Teams Still Have Chance Qualify Playoffs

ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు సంబంధించి ప్లేఆఫ్స్ రేసు ర‌స‌త‌వ‌త్త‌రంగా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈజీగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో ముంబై చేజేతులా ఓట‌మి కొనితెచ్చుకుంది. 

ముంబై బౌల‌ర్ రాజ్‌బ‌వా ఒత్తిడికి తోడు వైడ్లు, నోబ్ వేయ‌డంతో చివ‌రి ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు చేసి ఆర్సీబీ హ్యాట్రిక్ ఓట‌మిని త‌ప్పించుకోవ‌డంతో పాటు టేబుల్ టాప‌ర్‌గా నిలిచింది. ఇప్ప‌టికే వరుస ఓటములతో  ముంబై ఇండియ‌న్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే టాప్‌-4లో నిలిచేందుకు 8 జట్లు పోటీలో ఉండ‌డం గ‌మ‌నార్హం.

అగ్రస్థానంలో ఆర్సీబీ:
ప్ర‌స్తుతం టేబుల్ టాప‌ర్‌గా ఉన్న ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 7 విజ‌యాల‌తో 14 పాయింట్లు సాధించింది. (+1.103) నెట్ రన్‌రేట్‌తో ఇతర జట్ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు కావాలంటే ఇంకా రెండు విజయాలు అవసరం. సాధారణంగా 16 పాయింట్లు ప్లేఆఫ్స్‌కు స‌రిపోతాయి. కాబట్టి ఆర్సీబీ ఒక్క విజ‌యం సాధించినా స‌రిపోతుంది. కానీ ఎస్ఆర్‌హెచ్, పంజాబ్‌ల నుంచి పోటీ వ‌ద్ద‌నుకుంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలిచి నేరుగా క్వాలిఫ‌య‌ర్‌-1కు అర్హత సాధించే అవకాశం ఉంది.

హైదరాబాద్ రెండు గెలిస్తే:
సన్‌రైజ‌ర్స్‌ హైదరాబాద్ కూడా 14 పాయింట్లతోనే ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ (+0.737) విష‌యంలో ఆర్సీబీ కంటే వెనుకబడి ఉంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయ‌మ‌వుతుంది. మే 22న ఆర్సీబీతో జరిగే మ్యాచ్ టాప్-2 స్థానాలపై కీలక ప్రభావం చూపే అవకాశముంది. గుజరాత్ టైటాన్స్ కూడా 14 పాయింట్లతో పోటీలో ఉంది. అయితే వారి నెట్ రన్ రేట్ (+0.228) తక్కువగా ఉండటంతో మరో రెండు విజయాలు అవసరం. మే 12న ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ గుజరాత్‌కు కీలకంగా మారనుంది.

అనుకూల స్థితిలో పంజాబ్:
పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం అత్యంత అనుకూల స్థితిలో ఉన్న జట్టుగా కనిపిస్తోంది. 10 మ్యాచ్‌ల్లోనే 13 పాయింట్లు సాధించిన పంజాబ్‌కు మ‌రో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. నాలుగులో క‌నీసం రెండు గెలిస్తే చాలు 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తును పంజాబ్‌ దాదాపు ఖాయం చేసుకుంటుంది.

చెన్నైకి కనీసం రెండు విజయాలు:
ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం కఠిన పరిస్థితుల్లో ఉంది. సీఎస్కే ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్లో కనీసం రెండు గెలవాల్సిన అవసరముంది. అయితే వారి నెట్ రన్‌రేట్‌ (+0.185) పెద్దగా మెరుగ్గా లేకపోవడంతో అన్ని మ్యాచ్లు గెలిస్తేనే అవకాశం ఉంది.

ఒత్తిడిలో రాజస్థాన్:
రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతో సీఎస్కేతో సమానంగా ఉన్నప్పటికీ.. నెట్ రన్దేట్ (+0.082) తక్కువగా ఉంది. గత నాలుగు మ్యాచ్ ల్లో మూడు ఓటములు చవిచూడడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. సీఎస్కేతో కలిసి నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం రాజస్థాన్ పోరాడే అవకాశం ఉంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు కేకేఆర్ క‌చ్చితంగా గెలవాల్సిన అవ‌స‌ర‌ముంది. అప్పుడు కేకేఆర్‌ 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరే అవ‌కాశ‌ముంటుంది. అయితే మ్యాచ్‌లో ఒక్క ఓటమి ఎదురైనా కేకేఆర్ ఇంటిబాట ప‌ట్టాల్సిందే.

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు క‌ష్ట‌మే..
ఢిల్లీ క్యాపిటల్స్‌కు అవ‌కాశాలు అంతంత‌మాత్ర‌మే. ప్రస్తుతం వారి నెట్ రన్ రేట్ (-1.154) దారుణంగా ఉంది. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా రావాల్సిన అవ‌స‌ర‌ముంటుంది.

ముంబై, లక్నో అవుట్:
ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ పోరు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది.

చదవండి: ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ముంబై ఇండియన్స్‌ ఖేల్‌ ఖతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement