Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ గురించి ఒక కీలక విషయం బయటకొచ్చింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు జైస్వాల్ క్రాక్ వచ్చిన బ్యాట్‌తోనే బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ పంచుకున్నాడు.
నిజానికి ముంబైతో మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే జైస్వాల్ భారీ షాట్లు ఆడాడు. ఈ నేపథ్యంలో బ్యాట్‌కు చిన్న క్రాక్ వచ్చింది. బ్యాట్‌కు క్రాక్ వచ్చిన విషయాన్ని జైస్వాల్ కోచ్ విక్రమ్‌కు చూపించాడు. అయితే విక్రమ్ మాత్రం ఏం పర్లేదు.. విరిగిన బ్యాట్‌తో ఆడితే ఫలితం బాగుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదే విషయమై విక్రమ్ రాథోర్ స్పందిస్తూ.. ‘నిజానికి జైస్వాల్ బ్యాట్‌కు చిన్న పగులు మాత్రమే వచ్చింది. ఎంత గట్టి షాట్లు ఆడినా బ్యాట్‌కు తట్టుకునే సామర్థ్యముంది. అందుకే నేను జైస్వాల్‌ను అదే బ్యాట్‌తో బరిలోకి దిగమని చెప్పాను. అతడి నమ్మకమే అతడి బలం.’ అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఐపీఎల్ నిర్వాహకులు ట్విటర్‌లో పుంచుకోవడంతో వైరల్‌గా మారింది.
అలా జైస్వాల్ చిన్నపాటి క్రాక్ వచ్చిన బ్యాట్‌తోనే ముంబైతో మ్యాచ్‌లో బరిలోకి దిగి ఇరగదీశాడు. అసలే ముంబై ఇండియన్స్‌పై మంచి రికార్డు కలిగి ఉన్న జైస్వాల్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
మ్యాచ్ విషయానికొస్తే వర్షం అంతరాయంతో 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జైస్వాల్ (77), సూర్యవంశీ (39), పరాగ్ (20) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులకే పరిమితమైంది.
చదవండి: సెలెక్షన్ కమిటీపై షమీ సంచలన వ్యాఖ్యలు!


