
గ్వాలియర్: ఆద్యంతం ఆధిపత్యం చాటుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు 30వ సారి ఇరానీ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. రంజీ చాంపియన్ మధ్యప్రదేశ్ జట్టుతో ఆదివారం ముగిసిన ఐదు రోజుల ఫైనల్లో మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలోని రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు 238 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
437 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 58.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 81/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ ఆట చివరిరోజు మరో 117 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో సౌరభ్ కుమార్ మూడు వికెట్లు తీయగా... ముకేశ్ కుమార్, అతీత్, పుల్కిత్ నారంగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.