దాదాపు మూడు నెలల విరామానంతరం కాంపిటేటివ్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్.. రీఎంట్రీలో తుస్సుమనిపించాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఊహించినంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో ఆర్బీఐ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్.. రూట్ మొబైల్ లిమిటెడ్ జట్టుతో ఇవాళ (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్‌లో తేలిపోయాడు.
ఈ మ్యాచ్‌లో ఇషాన్‌కు మెరుపు అరంభమే లభించినప్పటికీ.. ఆతర్వాత నిలదొక్కుకోలేకపోయాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు చేసిన అతను.. మ్యాక్స్‌వెల్ స్వామినాథన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోయిన ఇషాన్.. వికెట్‌కీపింగ్‌లో పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో అతను ఇద్దరిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. సుమిత్ క్యాచ్ పట్టిన ఇషాన్.. సయన్ మొండల్‌ను స్టంపౌట్ చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన రూట్ మొబైల్ లిమిటెడ్.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 193 పరుగల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇషాన్ జట్టు ఆర్బీఐ 16.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.
ఇదిలా ఉంటే, ఇషాన్... టీమిండియా తరఫున తన చివరి టీ20ని 2023 నవంబర్‌లో ఆస్ట్రేలియాపై ఆడాడు. అనంతరం సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి సిరీస్ మధ్యలోనే ఇంటికి తిరిగొచ్చేశాడు. ఆతర్వాత రంజీల్లో ఆడి ఫామ్‌ను నిరూపించుకోవాలని బీసీసీఐతో పాటు చాలా మంది మాజీలు సూచించినా పెడచెవిన పెట్టిన ఇషాన్.. తాజాగా బీసీసీఐ కన్నెర్ర చేయడంతో దిగొచ్చి స్థానిక డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఆడుతున్నాడు. ఇషాన్ తీరుతో గుర్రుగా ఉన్న బీసీసీఐ అతని కాంట్రాక్ట్ రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment