Ishan Kishan Return?: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్‌పై బీసీసీఐ గుర్రుగా ఉందన్న వార్తల నేపథ్యంలో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో నిరూపించుకున్న తర్వాతే ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మళ్లీ సెలక్షన్‌కు అందుబాటులోకి వస్తాడని తెలిపాడు.
అంతవరకు ఇషాన్ కిషన్‌కు టీమిండియాలో స్థానం దక్కదని ద్రవిడ్ సంకేతాలు ఇచ్చాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టులకు ఎంపికైన ఇషాన్ సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి తిరిగి వచ్చాడు. మానసికంగా అలసిపోయానని.. కుటుంబంతో గడిపేందుకు తనకు సెలవు మంజూరు చేయాలని అతడు విజ్ఞప్తి చేయగా.. మేనేజ్‌మెంట్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి.
నమ్మకాన్ని వమ్ము చేశాడంటూ వదంతులు
అయితే, బీసీసీఐ పెద్దల నమ్మకాన్ని వమ్ము చేసేలా ఇషాన్ వ్యవహరించాడన్న కారణంతోనే అతడిని అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు పక్కనపెట్టినట్లు వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో.. తొలి టీ20 ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్‌కు ఇషాన్ గురించి ప్రశ్న ఎదురైంది.
అప్పుడే మళ్లీ టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ.. తేల్చేసిన ద్రవిడ్
ఇందుకు బదులిస్తూ.. ‘‘అలాంటిదేమీ లేదు. సెలక్షన్‌కు అతడు అందుబాటులో లేడు. నిజానికి సౌతాఫ్రికా టూర్‌లో ఉన్నపుడే తనకు బ్రేక్ కావాలని ఇషాన్ అడిగాడు. మేము కూడా అందుకు అంగీకరించాం.
అన్ని విధాలా మద్దతుగా నిలబడ్డాం. సమస్యకు తగిన పరిష్కారం వెదకాలని సూచించాం. ఆ తర్వాత అతడు ఇంత వరకు సెలక్షన్‌కు అందుబాటులోకి రాలేదు. ఒకవేళ తను మళ్లీ మైదానంలో దిగాలనుకుంటే.. దేశవాళీ క్రికెట్ ఆడి.. అప్పుడు సెలక్షన్‌కు అవైలబుల్‌గా ఉంటాడు’’ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు.
సంజూ, జితేశ్‌లకు లక్కీ ఛాన్స్
కాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ శాంసన్, జితేశ్ శర్మ వికెట్ కీపర్లుగా చోటు దక్కించుకున్నారు. ఇక టీ20 ప్రపంచకప్-2024కు ముందు టీమిండియా ఆడే ఆఖరి సిరీస్ ఇదే కావడం గమనార్హం.
మళ్లీ ఐపీఎల్-2024లో ప్రదర్శనను బట్టే ఇషాన్ వరల్డ్‌కప్ నాటికి తిరిగి వస్తాడా లేదా అన్నది తేలనుంది. అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకోవాలంటే జార్ఖండ్ తరఫున ఇషాన్ రంజీల్లో ఆడటం తప్ప మరోమార్గం లేదు. అక్కడ తనను తాను నిరూపించుకున్నా.. కేఎల్ రాహుల్ రూపంలో వికెట్ కీపర్ స్థానానికి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చదవండి: Ind vs Afg: అఫ్గన్ బ్యాటింగ్ సంచలనం.. 22 ఏళ్ల కెప్టెన్! రోహిత్ సేనతో ఢీ అంటే ఢీ! ఎవరితడు?
Comments
Please login to add a commentAdd a comment