వన్డే జట్టులో రెగ్యులర్ కాదు... వికెట్ కీపర్ల మధ్య పోటీలో తన స్థానంపై అనిశ్చితి... ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో చోటే దక్కలేదు... బంగ్లాదేశ్‌తో కూడా రెండు మ్యాచ్‌లలో బెంచీకే పరిమితం... ఇక ఆడే అవకాశం రాదనిపించింది. కానీ అనూహ్యంగా రోహిత్ శర్మ గాయపడటంతో చాన్స్ దక్కింది. గతంలో ఓపెనర్‌గా ఆడిన ఏకైక వన్డేలోనూ విఫలమే! అయితేనేం...అరుదుగా వచ్చే బంగారు అవకాశాన్ని రెండు చేతులతో ఎలా ఒడిసి పట్టుకోవాలో ఇషాన్ కిషన్ చూపించాడు.
ఓపెనర్‌గా దిగి విధ్వంసక ఇన్నింగ్స్‌తో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు. రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో భారతీయుడిగా నిలిచాడు. ఫోర్లు, సిక్సర్లతోనే 156 పరుగులు సాధించిన ఈ ‘జార్ఖండ్ పాకెట్ డైనమైట్’ ఆట ముందు బంగ్లాదేశ్ బౌలర్లు చేతులెత్తేశారు.
మరో ఎండ్‌లో కోహ్లి అంతటివాడు కూడా ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యాడు. కోహ్లి కూడా శతకం సాధించినా, కెరీర్ తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచిన తొలి క్రికెటర్‌గా ఘనత వహించిన ఇషానే ఈనాటి హీరో... అనంతరం తమ వల్ల ఛేదన కాదన్నట్లుగా బంగ్లాదేశ్ ఓటమిని ఆహ్వానించింది. ఇషాన్ సాధించిన స్కోరుకంటే కూడా 28 పరుగులు తక్కువగా చేసి ఆ ఒక్కడి చేతిలోనే బంగ్లా ఓడిపోయింది!
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయినా... చివరకు భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 227 పరుగుల భారీ ఆధిక్యంతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి తమ స్థాయిని చూపించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (131 బంతుల్లో 210; 24 ఫోర్లు, 10 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు.
మరోవైపు విరాట్ కోహ్లి (91 బంతుల్లో 113; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా శతకం బాదాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 31.4 ఓవర్లలో 290 పరుగులు జోడించడం విశేషం. ఇందులో ఇషాన్ వాటా 199 పరుగులు కాగా, కోహ్లి 85 పరుగులు సాధించాడు. అనంతరం బంగ్లాదేశ్ 34 ఓవర్లలో 182 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్ (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన బంగ్లాదేశ్ 2–1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు బుధవారం
నుంచి ఇదే మైదానంలో జరుగుతుంది.
రాహుల్ విఫలం...
శిఖర్ ధావన్ (3) వరుసగా మూడో వన్డేలోనూ విఫలం కాగా... మూడో స్థానంలో కోహ్లి తనదైన శైలిలో చెలరేగాడు. వ్యక్తిగత స్కోరు ‘1’ వద్ద లిటన్ దాస్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి ఆ తర్వాత జాగ్రత్త పడ్డాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 45 పరుగులకు చేరింది. ఈ దశలో ఇషాన్‌కు సహకారం అందించడంపైనే దృష్టి పెట్టిన కోహ్లి అర్ధ సెంచరీకి 54 బంతులు తీసుకోగా, ఇందులో 4 ఫోర్లే ఉన్నాయి.
ఆ తర్వాత మాత్రం అతను కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఇషాన్ వెనుదిరిగిన తర్వాత అతను చకచకా శతకం వైపు దూసుకుపోయాడు. ఇబాదత్ బౌలింగ్‌లో షార్ట్ ఫైన్‌లెగ్ దిశగా సిక్స్ కొట్టి 85 బంతుల్లో తన వన్డే కెరీర్లో 44వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆగస్టు 2019 తర్వాత వన్డేల్లో అతనికి ఇదే తొలి సెంచరీ. మరోవైపు శ్రేయస్ (3), రాహుల్ (8) విఫలం కాగా, వాషింగ్టన్ సుందర్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటితో స్కోరు 400 దాటింది. భారత్‌కు వన్డేల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు.
బౌండరీల వర్షం...
ముస్తఫిజుర్, తస్కీన్ ఓవర్లలో రెండేసి ఫోర్లతో బౌండరీల జోరు మొదలు పెట్టిన ఇషాన్‌ను నిలువరించడం బంగ్లా బౌలర్ల తరం కాలేదు. ఇబాదత్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదిన అతను 49 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరికొన్ని మెరుపు షాట్లతో ఈ యువ బ్యాటర్ దూసుకుపోయాడు. అఫీఫ్ బౌలింగ్‌లో స్వీప్ షాట్‌తో ఫోర్ కొట్టడంతో 85 బంతుల్లోనే ఇషాన్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఈ క్రమంలో అప్పటి వరకు 2 సిక్సర్లే బాదిన అతను శతకం తర్వాత మరింత చెలరేగిపోయాడు. ఇబాదత్, షకీబ్ వేసిన వరుస ఓవర్లలో ఇషాన్ రెండేసి సిక్సర్లు బాదాడు. 100 నుంచి 150కి చేరేందుకు ఇషాన్‌కు 18 బంతులే సరిపోయాయి. మెహదీ బౌలింగ్‌లో సిక్సర్‌తోనే అతను ఈ మైలురాయిని అందుకున్నాడు. అనంతరం మెహదీ ఓవర్లోనే 6, 4, 4తో భారత బ్యాటర్ చెలరేగాడు. తస్కీన్ ఓవర్లో 2 ఫోర్లతో 197కు చేరుకున్న ఇషాన్... ముస్తఫిజుర్ బౌలింగ్‌లో పాయింట్ దిశగా సింగిల్ తీసి కొత్త చరిత్ర సృష్టించాడు. డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్న క్షణం గర్జిస్తూ సంబరాలు చేసుకున్నాడు.
300 కొట్టేవాడా..!
35వ ఓవర్ చివరి బంతికి ఇషాన్ ద్విశతకం పూర్తయింది. సెంచరీ తర్వాత 41 బంతుల్లోనే డబుల్ సెంచరీ వచ్చింది. ఇన్నింగ్స్‌లో మరో 90 బంతులు మిగిలి ఉన్నాయి. ఆ సమయంలో అతని ఆట చూస్తే సగం బంతులు ఆడినా రోహిత్ శర్మ (264) స్కోరును దాటడంతోపాటు 300 కూడా కొట్టగలడేమో అనిపించింది. అయితే చివరకు దాస్ క్యాచ్‌తో ఈ దూకుడుకు బ్రేక్ పడింది. తస్కీన్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించగా, బంతి గాల్లో కి బాగా ఎత్తుకు లేచింది. బౌండరీ వద్ద బంతిని సరిగ్గా అంచనా వేసిన దాస్ పరుగెడుతూ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 156 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం.
ఇషాన్ కిషన్ రికార్డులు...
వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ (126 బంతులు; పాత రికార్డు క్రిస్ గేల్ (138 బంతులు; 2015లో జింబాబ్వేపై), పిన్న వయసులో డబుల్ సెంచరీ (24 ఏళ్ల 145 రోజులు; పాత రికార్డు రోహిత్ శర్మ (26 ఏళ్ల 186 రోజలు; 2013లో ఆస్ట్రేలియాపై), భారత్ తరఫున అతి తక్కువ (103) బంతుల్లో 150 పరుగుల మార్క్ (పాత రికార్డు సెహ్వాగ్ 112 బంతుల్లో; 2011లో వెస్టిండీస్‌పై)... ఈ ఘనతలన్నీ ఇషాన్ ఖాతాలో చేరాయి.
సిక్సర్‌తో సెంచరీ చెద్దాం అనుకున్నా.. కానీ
పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంది. దాంతో నేనేం చేయాలో స్పష్టంగా తెలిసింది. దిగ్గజాల సరసన నా పేరు చేరడం అదృష్టం. అందుకే బంతిని బాదడంపైనే దృష్టి పెట్టా. నాకు అన్నీ అనుకూలించాయి. 15 ఓవర్లు మిగిలి ఉన్నప్పుడు అవుటయ్యాను. 300 కూడా చేసేవాడినేమో. ఏ బౌలర్లను లక్ష్యంగా చేయాలో విరాట్ చెబుతూ వచ్చాడు. 95 వద్ద సిక్స్‌తో సెంచరీ చేయాలనుకున్నా, ఇది తొలి సెంచరీ కాబట్టి జాగ్రత్తగా ఆడమని అతను వారించాడు. ప్రస్తుత స్థితిలో ఎప్పుడు అవకాశం దక్కినా దానిని సమర్థంగా వాడుకోవడం ముఖ్యమని కిషన్ పేర్కొన్నాడు.
టపటపా...
తొలి రెండు వన్డేల్లో చూపిన స్ఫూర్తిదాయక ప్రదర్శనను బంగ్లా చివరి మ్యాచ్‌లో చూపించలేకపోయింది. కొండంత లక్ష్యం కనిపిస్తుండగా ముందే ఓటమికి జట్టు సిద్ధమైనట్లు అనిపించింది. ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోగా... కనీసం ఒక అర్ధసెంచరీ భాగస్వామ్యం కూడా లేక జట్టు వేగంగా ఓటమి దిశగా సాగింది. భారత బౌలర్ల ధాటికి 16 ఓవర్ల ముందే జట్టు ఆట ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment