![Jaiswal Learnt From His Upbringing Not You: England Great Blasts Star Player - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/20/jaiswal.jpg.webp?itok=_WWuRaur)
India vs England, 3rd Test- Yashasvi Jaiswal: సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతూ రికార్డులు కొల్లగొడుతున్నాడు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్. బజ్‌బాల్ అంటూ దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ జట్టుకు చెమటలు పట్టిస్తూ.. ప్రత్యర్థి వ్యూహాన్ని తిప్పికొడుతున్నాడు.
వరుస డబుల్ సెంచరీలతో ‘బజ్‌బాల్’ పగిలి రీసౌండ్ వచ్చేలా బ్యాట్‌తో మోత మోగిస్తున్నాడు. హైదరాబాద్‌లో ‘జైస్‌బాల్’తో అలరించిన యశస్వి.. వైజాగ్ టెస్టు సందర్భంగా తన కెరీర్‌లో తొలి ద్విశతకం బాదాడు. రాజ్‌కోట్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ 214 పరుగులతో అజేయంగా నిలిచాడు.
తద్వారా జట్టు భారీ విజయంలో యశస్వి జైస్వాల్ కీలక పాత్ర పోషించి నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ విధ్వంసకర సెంచరీ బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో 151 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 153 పరుగులు సాధించాడు.
ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ప్రత్యర్థి జట్టు కూడా దూకుడుగా ఆడటం చూస్తుంటే.. అందులో మేమూ కొంత క్రెడిట్ తీసుకోవాల్సిందే అనిపిస్తుంది. టెస్టు క్రికెట్‌లో మా మాదిరిగానే వాళ్లూ ఆడుతున్నారు’’ అని డకెట్ పేర్కొన్నాడు.
మండిపడ్డ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
అయితే, డకెట్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ ఘాటు విమర్శలు చేశాడు. ‘‘జైస్వాల్ మమ్మల్ని చూసే అలా ఆడటం నేర్చుకున్నాడని అన్నట్లుగా ఆ కామెంట్ ఉంది.
నిజానికి తను మీ నుంచి నేర్చుకునే స్థితిలో లేడు. కష్టపడటం అతడి పెంపకంలోనే ఉంది. బాల్యం నుంచే సవాళ్లు ఎదుర్కొని ఐపీఎల్ దాకా చేరుకున్నాడు. అక్కడ మరింతగా రాటుదేలాడు.
గట్టిగా మాట్లాడితే.. నేను కూడా తన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్తాను. ఇదంతా చూస్తుంటే.. బజ్‌బాల్‌ను మీరే తక్కువ చేసి మాట్లాడినట్లు అనిపిస్తోంది. దూకుడైన ఆటలో ఇంగ్లండ్ మరింత మెరుగుపడాలనుకుంటే విమర్శలకు దూరంగా ఉంటే మంచిది.
అదే విధంగా జైస్వాల్‌ను చూసి మీరు కూడా నేర్చుకోండి’’ నాసిర్ హుసేన్ డకెట్ తీరును విమర్శించాడు. స్కై స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: IND vs ENG: నాలుగో టెస్టు.. భారత తుది జట్టు ఇదే! సెంచరీల వీరుడి అరంగేట్రం?
Comments
Please login to add a commentAdd a comment