చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్‌.. ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలు | Jake Fraser McGurk Set World Record By Scoring 29 Ball Century In Australia Marsh Cup | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్‌.. ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలు

Published Sun, Oct 8 2023 12:10 PM | Last Updated on Sun, Oct 8 2023 12:23 PM

Jake Fraser McGurk Set World Record By Scoring 29 Ball Century In Australia Marsh Cup - Sakshi

21 ఏళ్ల ఆస్ట్రేలియా యువ బ్యాటర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ చరిత్ర సృష్టించాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేశాడు. ఆస్ట్రేలియా దేశవాలీ వన్డే టోర్నీ మార్ష్‌ కప్‌ 2023-24లో భాగంగా టస్మానియాతో ఇవాళ (అక్టోబర్‌ 8) జరుగుతున్న మ్యాచ్‌లో ఫ్రేజర్‌ (సౌత్‌ ఆస్ట్రేలియా) కేవలం 29 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న ఫ్రేజర్‌ 10 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ సెంచరీ ద్వారా ఫ్రేజర్‌ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉండిన ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలుకొట్టాడు. 2014-15లో జొహనెస్‌బర్గ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్‌ 31 బంతుల్లోనే శతక్కొట్టగా.. ఇవాల్టి మ్యాచ్‌లో ఫ్రేజర్‌ దాదాపు 10 సంవత్సరాలుగా చలామణిలో ఉండిన ఆ రికార్డును బద్దలు కొట్టాడు.

టస్మానియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫ్రేజర్‌ సృష్టించిన విధ్వంసం ఏ రేంజ్‌లో ఉండిందంటే.. 436 పరుగులు అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న అతని జట్టు (సౌత్‌ ఆస్ట్రేలియా) కేవలం 11.4 ఓవర్లలోనే 172 పరుగులు చేసింది. కేవలం 11.4 ఓవర్లలోనే ఫ్రేజర్‌ సెంచరీని పూర్తి చేసుకుని ఔటయ్యాడు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తున్న సౌత్‌ ఆస్ట్రేలియా సక్సెస్‌ సాధించే  దిశగా అడుగులు వేస్తుంది.

35 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలంటే 90 బంతుల్లో 122 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. నాథన్‌ మెక్‌స్వీనీ (47), జేక్‌ లీమన్‌ (25) క్రీజ్‌లో ఉన్నారు. సౌత్‌ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఫ్రేజర్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. హెన్రీ బ్రంట్‌ (51), డేనియల్‌ డ్రూ (52) అర్ధసెంచరీలు నమోదు చేశారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టస్మానియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టాని​కి 435 పరుగులు చేసింది. టస్మానియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ జోర్డన్‌ సిల్క్‌ (85 బంతుల్లో 116; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు శతకంతో విరుచుకుపడగా.. ఓపెనర్‌ కాలెబ్‌ జువెల్‌ (52 బంతుల్లో 90; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. రైట్‌ (51) అర్ధసెంచరీతో రాణించగా... చార్లీ వాకిమ్‌ (48), వెబ్‌స్టర్‌ (42), వెథరాల్డ్‌ (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

ఈ మ్యాచ్‌లో టస్మానియా నిర్ధేశించిన 436 పరుగుల లక్ష్యాన్ని సౌత్‌ ఆస్ట్రేలియా ఛేదిస్తే.. దేశవాలీ క్రికెట్‌ అతి భారీ లక్ష్య ఛేదనగా.. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో రెండో సక్సెస్‌ఫుల్‌ రన్‌ చేజ్‌గా రికార్డుల్లోకెక్కుతుంది. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో సక్సెస్‌ఫుల్‌ రన్‌ఛేజ్‌ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement