బుమ్రా చాంపియన్స్‌ ట్రోఫీకి డౌటే.. కానీ: పాక్‌ మాజీ క్రికెటర్‌ | Jasprit Bumrah has 10 percent chance of playing CT 2025: Basit Ali | Sakshi
Sakshi News home page

బుమ్రా చాంపియన్స్‌ ట్రోఫీకి డౌటే.. కానీ: పాక్‌ మాజీ క్రికెటర్‌

Published Thu, Jan 9 2025 10:58 AM | Last Updated on Thu, Jan 9 2025 11:40 AM

Jasprit Bumrah has 10 percent chance of playing CT 2025: Basit Ali

టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ప్ర‌స్తుతం వెన్ను గాయంతో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. సిడ్నీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు సంద‌ర్భంగా అతడి గాయం తిర‌గ‌బెట్టింది. వెంట‌నే బుమ్రాను ఆట మ‌ధ్య‌లోనే స్కానింగ్‌కు త‌ర‌లించారు.

ఈ క్ర‌మంలో అత‌డు రెండు ఇన్నింగ్స్ మొత్తానికి దూర‌మ‌య్యాడు.  కీల‌కమైన మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ చేయ‌లేక‌పోయాడు. అయితే ఛాంపియ‌న్స్ ట్రోపీ 2025కు ముందు బుమ్రా గాయం భారత సెలక్టర్లను తెగ ఆందోళ‌న క‌లిగిస్తోంది. అస్సలు ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడుతాడా? లేదా అని అభిమానులు సైతం టెన్షన్ పడుతున్నారు. కాగా బుమ్రా గాయంపై ఇంకా స్పష్టత రాలేదు.

అతడి గాయం తీవ్రత ఏ స్ధాయిలో ఉందో కూడా తెలియదు. ఒకవేళ అతడి గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉంటే, ఈ స్టార్ పేసర్ దాదాపు  5 నుంచి ఆరు వారాల పాటు ఆటకు దూరం ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లను కోల్పోవలసి ఉంటుంది.

అయితే బీసీసీఐ మాత్రం బమ్రా గాయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే ఆయా దేశ క్రికెట్ బోర్డులు త‌మ జ‌ట్ల వివ‌రాల‌ను జనవరి 12 నాటికి ఐసీసీకి స‌మర్పించాలి. దీంతో బుమ్రా గాయంపై ఒకట్రెండు రోజుల్లో అప్‌డేట్ వచ్చే అవకాశముంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడేది అనుమానమే అని అలీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బుమ్రా గాయంపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఆడే అవకాశాలు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయని తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.

కాగా జస్ప్రీత్ భారత జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ బుమ్రా అదరగొట్టాడు. మొత్తం 5 మ్యాచ్‌లో 32 వికెట్లు ప‌డ‌గొట్టి ప్లేయ‌ర్ ఆఫ్‌ది సిరీస్‌గా జ‌స్ప్రీత్ నిలిచాడు. ఈ సిరీస్‌లో మొత్తం 150 ఓవర్లకు పైగా బౌలింగ్ చేయ‌డం విశేషం.

టాప్‌లోనే బుమ్రా..
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్‌ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పటికే 907 రేటింగ్‌ పాయింట్లతో భారత్‌ నుంచి అత్యుత్తమ రేటింగ్‌ సాధించిన బౌలర్‌గా నిలిచిన బుమ్రా... ఇప్పుడు మరో పాయింట్‌ సాధించి 908 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలిచాడు.

ఈ జాబితాలో కమిన్స్‌ (841) రెండో స్థానంలో కొనసాగుతుండగా... భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపర్చుకొని 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ తన 4వ స్థానాన్ని నిలబెట్టుకోగా... సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు అర్ధసెంచరీ సాధించిన రిషభ్‌ పంత్‌ మూడు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో జడేజా నంబర్‌వన్‌గానే కొనసాగుతున్నాడు.
చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement