భారత్, పాక్ జట్లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను కలుపుకునే నాలుగు దేశాల టీ20 సిరీస్‌ను ప్లాన్ చేయాలన్న పీసీబీ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ప్రతిపాదించిన ఈ టోర్నీ వల్ల స్వల్పకాలిక వాణిజ్య ప్రయోజనాలే తప్ప, పెద్దగా ఉపయోగం ఉండదని బీసీసీఐ సెక్రెటరీ జై షా తేల్చిపారేశాడు. ఐపీఎల్, ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో స్వల్పకాలిక ప్రయోజనాలు (రమీజ్ రాజా ప్రతిపాదించిన నాలుగు దేశాల టోర్నీ) తమకు ముఖ్యం కాదని పీసీబీ ప్రతిపాదనను షా సున్నితంగా కొట్టిపారేశాడు.
దీంతో భారత్-పాక్ జట్లతో కూడిన నాలుగు దేశాల టీ20 సిరీస్‌కు ఆదిలోనే బ్రేకులు పడినట్లైంది. షా వ్యాఖ్యలతో దాయాదుల పోరు మరోసారి ఐసీసీ ఈవెంట్ల వరకే పరిమితమైంది. త్వరలో భారత-పాక్‌ల మధ్య సిరీస్ ఉంటుందని ఆశించిన ఇరు దేశాల అభిమానుల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. కాగా, గత నెలలో పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ఐసీసీ ముందు ఈ నాలుగు దేశాల క్రికెట్ సిరీస్ ప్రతిపాదనను ఉంచాడు. టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వచ్చిన టీఆర్పీలను బేస్ చేసుకుని పీసీబీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ సాధ్యపడదని తెలిసి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను కలుపుకుని తటస్థ వేదికలపై నాలుగు దేశాల టీ20 సిరీస్ నిర్వహిస్తే బావుంటందని పీసీబీ ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను బీసీసీఐ సున్నితంగా కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా అక్టోబర్ 23న దాయాదుల సమరం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని ఐసీసీ సోమవారం ప్రారంభించగా, గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ సేల్ అయిపోయాయి.
చదవండి: IND VS WI: రెండో వన్డేకు కేఎల్ రాహుల్ సహా కీలక ఆటగాళ్లు రెడీ..
Comments
Please login to add a commentAdd a comment