టీమిండియా క్రికెటర్ షాబాజ్ నదీమ్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ఇవాళ (మార్చి 5) ప్రకటించాడు. వయసు పైబడటంతో పాటు టీమిండియాకు ఆడే దారులు మూసుకుపోవడంతో తాను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు నదీమ్ వెల్లడించాడు. మన్ముందు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిపాడు.
34 ఏళ్ల నదీమ్ 2019-2021 మధ్యలో టీమిండియా తరఫున రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. జార్ఖండ్ స్టార్ స్పిన్నర్‌గా పేరున్న నదీమ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 140 మ్యాచ్‌లు ఆడి 542 వికెట్లు పడగొట్టాడు. నదీమ్ జార్ఖండ్ తరఫున రంజీల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. నదీమ్‌కు రంజీల్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇతను 2015-16, 2016-17 సీజన్లలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
నదీమ్‌కు లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ ఘనమైన రికార్డు ఉంది. నదీమ్ ఈ ఫార్మాట్‌లో 134 మ్యాచ్‌లు ఆడి 175 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో నదీమ్ పేరిట అత్యుత్తమ గణాంకాల రికార్డు (8/10) నమోదై ఉంది.
స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన నదీమ్‌కు ఐపీఎల్‌ల్లో కూడా ప్రవేశం ఉంది. నదీమ్.. 2011 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడుతూ వివిధ జట్ల తరఫున 72 మ్యాచ్‌ల్లో 48 వికెట్లు పడగొట్టాడు. నదీమ్ 2022 నుంచి లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలో సభ్యుడిగా ఉన్నాడు. నదీమ్ 2011లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున అత్యుత్తమంగా రాణించి ఐపీఎల్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment