జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ టైటిల్ సొంతం
ఫైనల్లో మధ్యప్రదేశ్‌పై 1–0 గోల్‌తో విజయం
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న జార్ఖండ్ జట్టు ఈసారి మాత్రం విన్నర్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో జార్ఖండ్ విజేతగా అవతరించింది. హోరాహోరీగా సాగిన తుది సమరంలో పుష్పా డాంగ్ సారథ్యంలోని జార్ఖండ్ జట్టు 1–0 గోల్ తేడాతో కృష్ణ శర్మ నాయకత్వంలోని మధ్యప్రదేశ్ జట్టును ఓడించింది. ఆట 15వ నిమిషంలో ఎడమ వైపు నుంచి జమునా కుమారి బంతితో దూసుకెళ్లి హెమ్‌రోమ్ లియోనికి పాస్ అందించింది.
హెమ్‌రోమ్ ఎలాంటి తప్పిదం చేయకుండా బంతిని లక్ష్యానికి చేర్చింది. దాంతో జార్ఖండ్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ జట్టు స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసింది. అయితే జార్ఖండ్ డిఫెన్స్ అత్యంత పటిష్టంగా ఉండటంతో చివరకు మధ్యప్రదేశ్‌కు ఓటమి తప్పలేదు. గత ఏడాది ఫైనల్లో హరియాణా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన జార్ఖండ్ ఈసారి మాత్రం టోర్నీ మొత్తం పకడ్బందీ ఆటతీరుతో అదరగొట్టింది.
టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడని జార్ఖండ్ ప్రత్యర్థి జట్లకు ఒకే ఒక్క గోల్ సమర్పించుకోవడం విశేషం. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మిజోరం జట్టు 4–3 గోల్స్ తేడాతో ఒడిశా జట్టుపై గెలిచింది. విజేతగా నిలిచిన జార్ఖండ్ జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ. 3 లక్షలు... రన్నరప్ మధ్యప్రదేశ్‌కు రూ. 2 లక్షలు... మూడో స్థానంలో నిలిచిన మిజోరం జట్టుకు రూ. 1 లక్ష ప్రైజ్‌మనీని ప్రకటించారు.
బహుమతి ప్రదానోత్సవంలో హాకీ ఇండియా కార్యదర్శి భోళానాథ్ సింగ్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (ఎస్‌ఏటీజీ) చైర్మన్ శివసేనా రెడ్డి, ఎస్‌ఏటీజీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీబాలా దేవి, తెలంగాణ హాకీ సంఘం కార్యదర్శి భీమ్ సింగ్, అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
272 మొత్తం 28 జట్లు పాల్గొన్న జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో నమోదైన మొత్తం గోల్స్. ఇందులో 191 ఫీల్డ్ గోల్స్, 76 పెనాల్టీ కార్నర్ గోల్స్, 5 పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment