
యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిన్న (జూన్ 16) మొదలైన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అజేయ సెంచరీ (152 బంతుల్లో 118 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించిన విషయం తెలిసిందే. ఈ సెంచరీ రూట్ టెస్ట్ కెరీర్‌లో 30వ సెంచరీ కాగా.. అన్ని ఫార్మాట్లలో ఇది అతనికి 46వ శతకం (వన్డేల్లో 16 శతకాలు కలుపుకుని).
ఈ సెంచరీతో రూట్.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉండి అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో రెండవ స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (అన్ని ఫార్మాట్లలో కలిపి 75 సెంచరీలు) అగ్రస్థానంలో ఉండగా.. రూట్ (46), డేవిడ్ వార్నర్ (45), రోహిత్ శర్మ (43), స్టీవ్ స్మిత్ (43), కేన్ విలియమ్సన్ (41), బాబర్ ఆజమ్ (30) వరుసగా 2 నుంచి 7 స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (100 శతకాలు) అగ్రస్థానంలో ఉండగా..రూట్ 11వ స్థానంలో నిలిచాడు.
ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment