PC: BCCI/X
గువాహటి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కరేబియన్ ఆటగాడు తొలి ఓవర్ నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా అరంగేట్ర పేసర్ ఆకిబ్ నబీకి చుక్కలు చూపించాడు.
అతడి ధాటికి నబీ తన మొదటి స్పెల్‌లో వేసిన 3 ఓవర్లలోనే ఏకంగా 35 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో క్యాంప్‌బెల్ కేవలం 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో భారత్‌పై అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన వెస్టిండీస్ బ్యాటర్‌గా క్యాంప్‌బెల్ కొత్త చరిత్ర సృష్టించాడు.

ఇప్పటివరకు ఈ రికార్డు కరేబియన్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2002లో అహ్మదాబాద్ వేదికగా (మళ్లీ 2019లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా) జరిగిన మ్యాచ్‌లలో గేల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌తో గేల్ పేరిట ఉన్న 24 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డును క్యాంప్‌బెల్ బద్దలు కొట్టాడు.
గత మ్యాచ్‌లో విండీస్ ఓడిపోయినప్పటికి క్యాంప్‌బెల్ మాత్రం 62 పరుగులతో అద్భుతమైన నాక్ ఆడాడు. ఇప్పుడు రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. అతడి విధ్వంసం ఫలితంగా విండీస్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. 13 ఓవర్లకు విండీస్ వికెట్ నష్టానికి 118 పరుగులు చేసింది.
Update:కాగా దూకుడుగా ఆడిన క్యాంప్‌బెల్ తన రెండో వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 68 బంతులు ఎదుర్కొన్న క్యాంప్‌బెల్.. 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు.
వన్డేల్లో భారత్‌పై వెస్టిండీస్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు
29 జె. క్యాంప్‌బెల్ - గౌహతి 2026
30 క్రిస్. గేల్ - అహ్మదాబాద్ 2002
30 క్రిస్. గేల్ - పోర్ట్ ఆఫ్ స్పెయిన్ 2019
32 హైండ్స్ - వడోదర 2002
33 పూరన్ - విశాఖపట్నం 2019


