పెర్త్ టెస్టులో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అవుటైన తీరు వివాదానికి దారి తీసింది. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల భారత జట్టు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. అంతేకాదు.. తాను అవుటైన తీరుకు రాహుల్ సైతం ఆశ్చర్యంతో పాటు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?!
ఆ ముగ్గురు విఫలం
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియాతో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో.. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(0), వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(0), నాలుగో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి(5) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి తరుణంలో మరో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు!
అయితే, టీమిండియా ఇన్నింగ్స్ 23వ ఓవర్‌లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ బంతితో బరిలోకి దిగాడు. అతడి బౌలింగ్‌లో రాహుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. దీంతో ఆసీస్ అప్పీలు చేయగా.. ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయినా సరే.. వెనక్కి తగ్గని ఆతిథ్య జట్టు రివ్యూకు వెళ్లింది.
థర్డ్ అంపైర్ మాత్రం
ఈ క్రమంలో థర్డ్ అంపైర్ రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించాడు. నిజానికి.. బంతి కీపర్ చేతుల్లో పడే సమయంలో వచ్చిన శబ్దం.. బ్యాట్ రాహుల్ ప్యాడ్‌కు తాకడం వల్ల వచ్చిందా? లేదంటే బంతిని తాకడం వల్ల వచ్చిందా అన్న అంశంపై స్పష్టత రాలేదు. కానీ రీప్లేలో వివిధ కోణాల్లో పరిశీలించకుండానే.. కేవలం స్నీకో స్పైక్ రాగానే థర్డ్ అంపైర్ రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించడం గమనార్హం.
థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం
థర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం విమర్శలకు కారణమైంది. రాహుల్ సైతం తీవ్ర అసంతృప్తితో మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇదొక చెత్త నిర్ణయం. పెద్ద జోక్ కూడా’’ అంటూ మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప ఫైర్ అయ్యాడు.
మరోవైపు.. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం.. ‘‘ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం నాటౌట్. అయినా స్పష్టత లేకుండానే అతడి కాల్‌ను ఎలా తిరస్కరిస్తారు. బ్యాట్ ప్యాడ్‌ను తాకినట్లు కనిపిస్తున్నా.. ఇదేం విచిత్రం. ఇది ఒక మతిలేని నిర్ణయం. చెత్త అంపైరింగ్’’ అంటూ ఘాటుగా విమర్శించాడు.
ఇక ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హెడెన్ కూడా రాహుల్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం విశేషం. కాగా రాహుల్ తొలి రోజు ఆటలో భాగంగా 74 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసి నిష్క్రమించాడు.
చదవండి: 77 ఏళ్లలో ఇదే తొలిసారి.. అరుదైన రికార్డుతో చరిత్ర పుటల్లోకి కమిన్స్, బుమ్రా!
Matthew Hayden explaining the KL Rahul bat-pad scenario.
- Unlucky, KL. 💔 pic.twitter.com/lf0UOWwmy8— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024
Comments
Please login to add a commentAdd a comment