పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెడ్‌బాల్ టోర్నీలపై దృష్టి పెట్టకుండా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. ఆటను ఎలా అభివృద్ధి చేయాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని చూసి పీసీబీ నేర్చుకోవాలని సూచించాడు.
పాక్ క్రికెట్ సరైన గాడిలో పడాలంటే మూలాల నుంచి ప్రక్షాళన అవసరమని బసిత్ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా సొంతగడ్డపై పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ చేతిలో తొలిసారిగా టెస్టు మ్యాచ్‌లో పాక్ ఓడిపోయింది.
తొలిసారి బంగ్లా చేతిలో పాక్ ఓటమి
తొలి టెస్టులో ఒక్క రెగ్యులర్ స్పిన్నర్ లేకుండా ఏకంగా నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగి భారీ మూల్యం చెల్లించింది. మరోవైపు.. బంగ్లాదేశ్ ఇద్దరు ప్రధాన స్పిన్నర్లతో రంగంలోకి దిగింది. ఇక పాక్ అత్యుత్సాహంతో 6 వికెట్లకే తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా... ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బంగ్లాదేశ్ ఏకంగా 117 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది.
ఆట చివరి రోజు బంగ్లాదేశ్ సీనియర్ స్పిన్నర్లు షకీబ్, మెహదీ హసన్ మిరాజ్ చెలరేగిపోవడంతో పాక్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో షాన్ మసూద్ బృందం ఆట తీరు సహా పీసీబీ విధానాలపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఈ టెస్టు సిరీస్ తర్వాత చాంపియన్స్ కప్ అనే వన్డే టోర్నీని నిర్వహించబోతున్నారు.
బీసీసీఐని చూసి కాస్త బుద్ధి తెచ్చుకోండి
పీసీబీ.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు ఏం చేసినా కాపీ కొట్టేది. మరి పొరుగు దేశం భారత్ వైపు ఒకసారి చూడవచ్చు కదా! దయచేసి వాళ్ల వ్యవస్థను కూడా కాపీ కొట్టండి. మార్పులు కూడా అవసరం లేదు. ఎందుకంటే.. కాపీ కొట్టడంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటారని తెలుసు.
అందుకే వాళ్లేం చేస్తే యథాతథంగా మీరూ చేసేయండి. ఇండియాలో తదుపరి దులిప్ ట్రోఫీ మొదలుకాబోతోంది. అదేమీ టీ20 లేదా వన్డే టోర్నమెంట్ కాదు. నాలుగు రోజుల ఆట ఉండే రెడ్‌బాల్ టోర్నీ. మూలాల నుంచి క్రికెట్‌ను పటిష్టం చేయడంపై వాళ్లు దృష్టిసారించారు.అందుకే ఆ జట్టు విజయవంతమైనదిగా నిలుస్తోంది’’ అంటూ పీసీబీ యాజమాన్యాన్ని తూర్పారపడుతూనే హితవు పలికాడు.
పాక్ జట్టు వరుస వైఫల్యాలు
ఇప్పటికైనా రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించకపోతే పాక్ జట్టు మరిన్ని పరాభవాలు చవిచూడక తప్పదని బసిత్ అలీ ఈ సందర్భంగా హెచ్చరించాడు. కాగా పాకిస్తాన్ జట్టు ఇటీవలి కాలంలో ఘోరంగా విఫలమవుతోంది. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో... ఆటగాళ్ల ఫిట్‌నెస్ లేమి, సెలక్షన్ విషయంలో బంధుప్రీతి కారణంగానే ఇలా పరాజయాలు అంటూ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. ఈ క్రమంలో పాక్ కొత్తగా మూడు దేశవాళీ టోర్నీలు ప్రవేశ్‌పెట్టి.. ప్రాథమిక దశ నుంచే క్రికెట్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపింది.
కొత్తగా మూడు టోర్నీలు
దేశవాళీ క్రికెట్ 2024- 2025లో భాగంగా చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ టోర్నీ నిర్వహిస్తామని పేర్కొంది. మరోవైపు.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా ఫిట్‌గా ఉంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే నిబంధన విధించిన విషయం తెలిసిందే.
చదవండి: ‘రోహిత్ 59 శాతం.. విరాట్ 61 శాతం.. అయినా ఇంకెందుకు రెస్ట్?’
Comments
Please login to add a commentAdd a comment