న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్‌కు దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ సున్నితమైన వార్నింగ్ ఇచ్చాడు. ఇంగ్లీష్ గడ్డపై దూకుడు తగ్గించుకొని బ్యాటింగ్ చేయాలని హెచ్చరించాడు. ప్రతి బంతిని బాదడానికి ప్రయత్నించకూడదని, క్రీజులో ఎక్కువ సమయం గడిపేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించాడు. గతంలో రోహిత్ శర్మకు కూడా ఇదే సలహా ఇచ్చానని పేర్కొన్నాడు. తాజాగా ఓ జాతీయ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కపిల్ మాట్లాడుతూ..
పంత్ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా పరిణితి చెందాడని, అందుకు అతని ఇటీవల కాలంలో ఫామే నిదర్శనమని చెప్పుకొచ్చాడు. అయితే అతని సహజ సిద్దమైన ఆటతీరుకి ఇంగ్లండ్ లో పరిస్థితులు అనుకూలించకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ పిచ్ లపై ప్రతి బంతిని బాధాలని ప్రయత్నించకూడదని, క్రీజ్ లో ఎక్కువ సమయం గడిపితే పరుగులు ఆవంతకవే వస్తాయని తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటనలో పంత్ ఈ ప్రణాళికను అమలుచేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు.
కాగా, గతంలో ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మకు కూడా ఇదే విషయాన్ని చెప్పానని కపిల్ ప్రస్తావించాడు. రోహిత్ కూడా పంత్ లాగే ప్రతి బంతిని బలంగా బాధాలనుకుండేవాడని, అయితే ఈ సలహాను పాటించడం వల్ల అతను సత్ఫలితాలు సాధించాడని పేర్కొన్నాడు. రోహిత్ లాగే పంత్ కూడా చాలా తెలివైన, విలువైన ఆటగాడని.. తాను చెప్పిన ఫార్ములాను ఇంగ్లండ్ గడ్డపై అమలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలో న్యూజిలాండ్ తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు అతిథ్య ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
ఇదిలా ఉంటే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ను బెస్టాఫ్ 3 ఫార్మాట్‌లో నిర్వహించాలని కపిల్ బీసీసీఐ కి సూచించాడు. రెండేళ్ల పాటు సాగిన టోర్నీలో ఒక్క మ్యాచ్‌తో విజేతను తేల్చడం కంటే, బెస్టాఫ్ 3 పద్దతిలో ఫైనల్ నిర్వహించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఈ టోర్నీ ని ప్రవేశపెట్టడం వల్ల టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెరిగిందని, బెస్టాఫ్ 3 పద్దతి వల్ల ప్రేక్షకులకు కావాల్సిన మజా లభించడంతో పాటు టెస్ట్ ఫార్మాట్ కు మరింత ఆదరణ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
చదవండి: ఏంటి కోహ్లి.. ఫీజు ఒకేసారి చెల్లిస్తావా లేక ఈఎంఐల్లో కడతావా.. ?
Comments
Please login to add a commentAdd a comment