
క్రికెట్ మికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు సమయం అసన్నమైంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ మహాసంగ్రామానికి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు కరాచీ వేదికగా తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి.
గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉండగా.. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అప్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. ఈ ఈవెంట్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌కి వెళ్తే ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరగనున్నాయి. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. తొలుత మొండి పట్టుపట్టినప్పటికి ఐసీసీ డిమాండ్లకు పీసీబీ తలొగ్గింది.
ఇక ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడునుంది. ఆ తర్వాత ఈ నెల 23న దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. అయితే భారత్‌కు జస్ప్రీత్ బుమ్రా గాయం రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగలింది. బుమ్రా గాయం కారణంగా ఈ ఐసీసీ టోర్నీకి దూరమయ్యాడు.
అతడి స్ధానాన్ని హర్షిత్ రాణాతో సెలక్టర్లు భర్తీ చేశారు. అదేవిధంగా ఆఖరి నిమిషంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఎంపిక చేశాడు.
పేసర్ హర్షిత్ రాణా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్‌లను పీటర్సన్ పట్టించుకోలేదు. ఓపెనర్లగా రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌లకు తన జట్టులో పీటర్సన్ చోటిచ్చాడు. అదేవిధంగా విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌లకు ఫస్ట్ డౌన్, సెకెండ్ డౌన్‌లో అతడు అవకాశమిచ్చాడు.
మిడిలార్డర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పీటర్సన్ సెలక్ట్ చేశాడు. ఫినిషర్లగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను పీటర్సన్ ఎంపిక చేశాడు. కాగా ఈ మెగా టోర్నీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో భారత క్లీన్ స్వీప్ చేసింది. ఇదే జోరును ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి పీటర్సన్ ఎంపిక చేసిన భారత తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
చదవండి: ప్లీజ్.. నన్ను కింగ్ అని పిలవకండి: బాబర్ ఆజం
Comments
Please login to add a commentAdd a comment