ఆర్సీబీ తేలిపోయింది.. | Kings Punjab Beat RCB By 97 Runs | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ తేలిపోయింది..

Published Thu, Sep 24 2020 11:06 PM | Last Updated on Thu, Sep 24 2020 11:16 PM

Kings Punjab Beat RCB By 97 Runs - Sakshi

దుబాయ్‌:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రాయల్స్‌ చాలెంజర్స్‌.. కింగ్స్‌  పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ఊపు మీద కనిపించిన ఆర్సీబీ.. తన రెండో మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. టాపార్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌ మొత్తం విఫలం కావడంతో ఆర్సీబీ  97 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ 17 ఓవర్లలో 109 పరుగులకే పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. సమష్టిగా రాణించిన కింగ్స్‌ పంజాబ్‌ ఘన విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం అంచుల వరకూ వెళ్లి ఓడిన కింగ్స్‌ పంజాబ్‌.. ఈ మ్యాచ్‌లో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా భారీ విజయాన్ని అందుకుంది.  కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో  రవి బిష్నోయ్‌, మురుగన్‌ అశ్విన్‌లు చెరో మూడు వికెట్లు సాధించగా, షెల్డాన్‌ కాట్రెల్‌ రెండు వికెట్లతో మెరిశాడు. ఇక షమీ, మ్యాక్స్‌వెల్‌లు వికెట్‌ చొప్పున తీశారు. ఆర్సీబీ ఆటగాళ్లలో ఫించ్‌(20), డివిలియర్స్‌(28), వాషింగ్టన్‌ సుందర్‌(30), శివం దూబే(12)లు రెండంకెల స్కోరు చేసిన ఆటగాళ్లు.

207 పరుగుల టార్గెట్‌లో ఒత్తిడికి లోనైన ఆర్సీబీ నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ మూడు ఓవర్లు ఆడకుండానే మూడు వికెట్లను కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఆర్సీబీ ఆడిన గత మ్యాచ్‌లో మెరిసిన ఓపెనర్‌ దేవదూత్‌ పడిక్కల్‌(1) నిరాశపరచగా, ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన జోష్‌ ఫిలిప్పి డకౌట్‌ అయ్యాడు. దేవదూత్‌ను కాట్రెల్‌ బోల్తా కొట్టించగా, ఫిలిప్పిను షమీ ఔట్‌ చేశాడు. ఇక ఆదుకుంటాడనుకున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. కాట్రెల్‌ బౌలింగ్‌ షాట్‌ ఆడిన కోహ్లి.. రవి బిష్నోయ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై డివిలియర్స్‌-ఫించ్‌లు కాసేపు మరమ్మత్తులు తప్పితే అద్భుతాలేమీ జరగలేదు.(చదవండి: రెచ్చిపోయిన కేఎల్‌ రాహుల్‌)

అంతకుముందు కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ చెలరేగిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఫెయిలైన రాహుల్‌.. ఆర్సీబీ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయాడు. .లయ తప్పిన బంతిని బౌండరీలు దాటించడమే లక్ష్యంగా ఆడాడు.  ఈ క్రమంలోనే 36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత రాహుల్‌ బ్యాట్‌కు మరింత పనిచెప్పాడు. మరొక ఎండ్‌ నుంచి సరైన సపోర్ట్‌ లేకపోయినా రాహుల్‌ మాత్రం రెచ్చిపోయాడు. ప్రధానంగా స్లాగ్‌ ఓవర్లలో రాహుల్‌ బ్యాట్‌ ఝుళిపించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  62 బంతుల్లో  12 ఫోర్లు,  3 సిక్స్‌లతో శతకం సాధించాడు. ఇది ఈ ఐపీఎల్‌ తొలి శతకంగా నమోదైంది. రాహుల్‌ ఇచ్చిన రెండు క్యాచ్‌లను కోహ్లి వదిలేయడంతో దాన్ని సద్వినియోగం చేసుకుని శతకంతో మెరిశాడు. 69 బంతుల్లో  14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా కింగ్స్‌ పంజాబ్‌ మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఇది రాహుల్‌కు  రెండో ఐపీఎల్‌ సెంచరీ కాగా, ఓవరాల్‌ లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన భారత ఆటగాడిగా ఈ కింగ్స్‌ కెప్టెన్‌ నిలిచాడు.(చదవండి: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ డీన్‌జోన్స్‌ ఇకలేరు..)

టాస్‌ గెలిచిన ఆర్సీబీ ముందు ఫీల్డింగ్‌ తీసుకోవడంతో కింగ్స్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌కు దిగింది. కింగ్స్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌-మయాంక్‌ అగర్వాల్‌లు ఆరంభించారు. జట్టు స్కోరు 57 పరుగుల వద్ద ఉండగా మయాంక్‌(26; 20 బంతుల్లో 4 ఫోర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. యజ్వేంద్ర చహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ ఆఖరి బంతికి మయాంక్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత నికోలస్‌ పూరన్‌తో కలిసి రాహుల్‌ ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు.  రాహుల్‌ తన సహజసిద్ధమైన షాట్లతో అలరిస్తూ స్కోరు బోర్డును పెంచాడు. ఇక పూరన్‌ ఆది నుంచి బ్యాటింగ్‌ చేయడానికి తడబడుతూ కనిపించాడు. చివరకు వీరిద్దరూ 57 పరుగుల భాగ‍్వామ్యాన్ని .జత చేసిన తర్వాత పూరన్‌(17) పెవిలియన్‌ చేరాడు. శివం దూబే బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కాసేపటికి మ్యాక్స్‌వెల్‌(5) కూడా పెవిలియన్‌ చేరడంతో కింగ్స్‌ 128 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. కానీ రాహుల్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండి సెంచరీ సాధించాడు. ఇది రాహుల్‌కు ఐపీఎల్‌ రెండో సెంచరీ కాగా, ఈ లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన భారత ఆటగాడిగా ఈ కింగ్స్‌ కెప్టెన్‌ నిలిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement