ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టడంతో (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. నిన్నటి సెంచరీతో క్యాష్ రిచ్ లీగ్‌లో సెంచరీల సంఖ్యను ఆరుకు పెంచుకున్న బట్లర్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌తో (6) కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని షేర్ చేసుకున్నాడు.
బట్లర్ తన వందో ఐపీఎల్ మ్యాచ్‌లో వంద కొట్టడం మరో విశేషం. ఐపీఎల్ చరిత్రలో బట్లర్‌కు ముందు కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. రాహుల్ సైతం తన వందో మ్యాచ్‌లో శతక్కొట్టాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉంది. బట్లర్ నిన్న సెంచరీ చేసిన మ్యాచ్‌లోనే విరాట్ కూడా సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో విరాట్ ఐపీఎల్ సెంచరీల సంఖ్య ఎనిమిదికి చేరింది.
మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ తన సెంచరీ పూర్తి చేసేందుకు 67 బంతులు తీసుకుని విమర్శలపాలయ్యాడు.
ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఇది స్లోయెస్ట్ సెంచరీ కావడమే విరాట్‌పై విమర్శలకు కారణం. అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విరాట్ వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. పిచ్ కూడా విరాట్ బ్యాటింగ్ సమయంలో స్పిన్నర్ల పక్షాన ఉండింది.
అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్‌తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాయల్స్ విజయానికి ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన తరుణంలో బట్లర్ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తాజా ఓటమితో ఆర్సీబీ ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment