స్లో ఇన్నింగ్స్‌ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే | RCB Kohli Slams Slowest IPL Ton Ever Then Says Couldnt Get Over | Sakshi
Sakshi News home page

Virat Kohli: స్లో ఇన్నింగ్స్‌ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే

Published Sun, Apr 7 2024 9:41 AM | Last Updated on Sun, Apr 7 2024 2:38 PM

RCB Kohli Slams Slowest IPL Ton Ever Then Says Couldnt Get Over - Sakshi

ఐపీఎల్‌-2024లో సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి. అంతేకాదు క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో 7500 పరుగుల మైలురాయి అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా శనివారం ఈ ఘనత సాధించాడు.

కోహ్లి స్లో ఇన్నింగ్స్‌
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్‌ స్టేడియంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది ఆర్సీబీ. ఈ క్రమంలో ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి 113 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ 44 పరుగులు సాధించాడు.

వీరి తర్వాతి స్థానాల్లో బరిలోకి దిగిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌(1), సౌరవ్‌ చౌహాన్‌(9) పూర్తిగా నిరాశపరిచారు. కామెరాన్‌ గ్రీన్‌ ఆరు బంతులు ఎదుర్కొని 5 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 183 రన్స్‌ స్కోరు చేసింది.

లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌ 19.1 ఓవర్లలోనే పని పూర్తి చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ బ్యాటర్లలో కోహ్లి స్లో ఇన్నింగ్స్‌ ఫలితాన్ని ప్రభావితం చేసిందంటూ విమర్శలు వస్తున్నాయి.

దూకుడుగా ఆడలేకపోయానని తెలుసు
ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ అనంతరం విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ‘‘చూసేందుకు వికెట్‌ కాస్త ఫ్లాట్‌గా అనిపించింది. కానీ మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ పిచ్‌ స్వభావం మారిపోయింది.

కాబట్టి మా(విరాట్‌/డుప్లెసిస్‌)లో ఒక్కరైనా ఆఖరి వరకు బ్యాటింగ్‌ చేయాలని భావించాం. ఈ పిచ్‌పై 183 రన్స్‌.. మెరుగైన స్కోరే అనిపిస్తోంది. ఇలాగే బ్యాటింగ్‌ చేయాలని నేనేమీ ముందే ప్రణాళికలు రచించుకోలేదు.

నేను దూకుడుగా ఆడలేకపోయానని నాకు తెలుసు. బౌలర్ల వ్యూహాలను అంచనా వేసి అందుకు తగ్గట్లుగా బ్యాటింగ్‌ చేశాను. పరిస్థితులకు అనుగుణంగా పరిణతితో కూడిన ఇన్నింగ్స్‌ ఆడటం అవసరమని భావించా.

ఈ పిచ్‌పై అలవోకగా పరుగులు రాబట్టడం బ్యాటర్లకు అంత సులువేమీ కాదు’’ అని విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. యజువేంద్ర చహల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో హిట్టింగ్‌ ఆడటం కుదరలేదని తెలిపాడు. 

కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి 67 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌ హిస్టరీలోనే ఇది స్లోయెస్ట్‌ సెంచరీ. ఇక ఇదే మ్యాచ్‌లో రాజస్తాన్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ 58 బంతుల్లోనే 100 పరుగుల మార్కు అందుకుని సిక్సర్‌తో జట్టును గెలిపించడం విశేషం. 

చదవండి: IPL 2024: నీకు ‘బడిత పూజ’ తప్పదు.. యువీ ‘ఫైర్‌’!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement