న్యూఢిల్లీ: యూఏఈలో ఐపీఎల్ సజావుగా జరిపేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉండాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆటగాళ్లకు ప్రతీ రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. సెప్టెంబర్ 19 నుంచి అరబ్ ఎమిరేట్స్‌లో లీగ్‌ను నిర్వహించాలని భారత బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో నెస్ వాడియా ఈ వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే ఐపీఎల్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ని బీసీసీఐ తయారు చేయనుంది. ‘ఐపీఎల్ జరిగే సమయంలో మైదానంలోనూ, మైదానం బయట కూడా కచ్చితమైన ఆరోగ్య పరిరక్షణ నిబంధనలు పాటించాలి. ఇందులో ఏమాత్రం రాజీ పడరాదు. సాధ్యమైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు జరపాలి. సరిగ్గా చెప్పాలంటే ప్రతి రోజూ నిర్వహిస్తే మంచిది. నేనే ఆటగాడినైతే ఎలాంటి అభ్యంతరం చెప్పను. లీగ్‌లో ఎనిమిది జట్లు ఉంటాయి కాబట్టి ఇంగ్లండ్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్ తరహాలోనైతే బయో సెక్యూర్ వాతావరణం సాధ్యం కాదు. కోవిడ్–19 పరీక్షల విషయంలో యూఏఈ కూడా చాలా బాగా పని చేస్తోంది కాబట్టి బీసీసీఐ అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తే చాలు’ అని నెస్ వాడియా వివరించారు.
టీవీలో సూపర్ హిట్టవుతుంది...
కరోనా కష్టకాలంలో ఐపీఎల్‌కు స్పాన్సర్లు రాకపోవచ్చనే వాదనను నెస్ వాడియా తిరస్కరించారు. నిజానికి స్పాన్సర్లు అదనపు ప్రయోజనం పొందేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదని ఆయన అన్నారు. ‘గతంలో ఏ ఐపీఎల్‌కూ లభించని వీక్షకాదరణ టీవీల్లో ఈసారి లీగ్‌కు దక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జనం మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రకంగా స్పాన్సర్లు ముందుకొచ్చేందుకు ఇది సరైన తరుణం’ అని పంజాబ్ యజమాని పేర్కొన్నారు. మరోవైపు ప్రేక్షకులు లేకుండా లీగ్‌ను ఆడిస్తే తాము టికెట్ల రూపేణా కోల్పోయే నష్టాన్ని బీసీసీఐ ఏదో రూపంలో భర్తీ చేస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment