దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పందించాడు. కిర్‌స్టెన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని.. ఈ క్రమంలోనే అతడితో తమ బంధం ముగిసిందని పేర్కొన్నాడు. త్వరలోనే పాక్ పరిమిత ఓవర్ల జట్టుకు కొత్త కోచ్‌ను నియమిస్తామని తెలిపాడు.
అందుకే రాజీనామా!
కాగా పాకిస్తాన్ వన్డే, టీ20 జట్లకు హెడ్ కోచ్‌గా ఉన్న గ్యారీ కిర్‌స్టెన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు అతడు సోమవారం ప్రకటించాడు. రెండేళ్ల కాంట్రాక్ట్ వ్యవధితో ఈ ఏడాది ఏప్రిల్‌లో కిర్‌స్టెన్‌ను ప్రధాన కోచ్‌గా పీసీబీ నియమించింది.
కానీ.. కనీసం ఆరు నెలలు కూడా అతడు కోచ్‌గా పని చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ వెళ్లనున్న నేపథ్యంలో కిర్‌స్టెన్ తన పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. అయితే, జట్టు ఎంపిక విషయంలో తనకు ఉన్న అధికారాలను తప్పించడం పట్ల కలత చెందిన కిర్‌స్టెన్ రాజీనామా చేసినట్లు సమాచారం.
పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్లను ఎంపిక చేసే విషయంలో తన సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకోకపోగా... తాను దేశంలోనే లేని సమయంలో జట్టును ప్రకటించడంపై పీసీబీ అధికారులతో కిర్‌స్టెన్ వాదనకు దిగినట్లు తెలిసింది.
కాగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ తొలి టెస్టులో చిత్తయిన తర్వాత పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని కిర్‌స్టెన్‌కు పీసీబీ సూచించడం గమనార్హం.
ఇక కిర్‌స్టెన్‌తో టెస్టు టీమ్ హెడ్ కోచ్‌గా ఉన్న జాసన్ గిలెస్పీ కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నా... ఇంగ్లండ్‌తో తర్వాతి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించి పాక్ సిరీస్ గెలుచుకోవడంతో ఈ అంశం కాస్త వెనక్కి వెళ్లింది.
ఒక్క వన్డే ఆడకుండా...
ఇదిలా ఉంటే.. కిర్‌స్టెన్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్‌లో బరిలోకి దిగింది. గ్రూప్ దశలో భారత్, అమెరికా చేతుల్లో పరాజయంతో సూపర్–8 దశకు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అయితే, 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాను వన్డే వరల్డ్ చాంపియన్‌గా నిలిపిన రికార్డు ఉన్న కిర్‌స్టెన్‌ను ఎంపిక చేసినప్పుడు ప్రధానంగా తమ వన్డే టీమ్‌ను తీర్చిదిద్దే విషయంపైనే బాధ్యతలు అప్పగించారు.
అంతేకాదు.. 2025లో పాకిస్తాన్ వేదికగా జరిగే చాంపియన్స్ ట్రోఫీలో తమ టీమ్‌ను విజేతగా నిలపాలని...అందు కోసం ఆయన ఆలోచనల ప్రకారం జట్టును మలిచే అధికారాన్ని పీసీబీ ఇచ్చింది. అయితే ఈ ఆరు నెలల వ్యవధిలో పాక్ ఒక్క వన్డే కూడా ఆడకపోవడం విశేషం!
గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలు
మరోవైపు ప్రస్తుతం టెస్టు కోచ్‌గా ఉన్న ఆసీస్ మాజీ పేస్ బౌలర్ గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు పీసీబీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘కిర్‌స్టెన్ పీసీబీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. అంతేకాదు.. బోర్డు నిబంధనల్లో కొన్నిటిని ఉల్లంఘించాడు. మాతో కాంట్రాక్టును అతడే ముగించుకున్నాడు’’ అని తెలిపాడు.
ఐదుగురిని సంప్రదించా
ఇక జింబాబ్వే పర్యటన సందర్భంగా తమ వన్డే, టీ20 జట్లకు కొత్త కోచ్ వస్తాడని నక్వీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై పాక్ ఆడే మూడు వన్డేలు, మూడు టీ20 వరకు మాత్రమే తాను కోచ్‌గా పని చేస్తానని గిల్లెస్పీ చెప్పాడని పేర్కొన్నాడు. అతడికి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకునే ఉద్దేశం లేదని తెలిపిన నక్వీ.. కొత్త కోచ్ అన్వేషణలో భాగంగా ఇప్పటికే తాను ఐదుగురిని సంప్రదించానని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. పది జట్ల రిటెన్షన్ లిస్టు ఇదే!
Comments
Please login to add a commentAdd a comment