IPL: లిటన్‌ దాస్‌ సంచలన ఆరోపణలు | KKR Didnt Really Need Me Didnt Support Me: Litton Das Huge Claim | Sakshi
Sakshi News home page

IPL: లిటన్‌ దాస్‌ సంచలన ఆరోపణలు

May 18 2026 4:48 PM | Updated on May 18 2026 5:45 PM

KKR Didnt Really Need Me Didnt Support Me: Litton Das Huge Claim

బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లిటన్‌ దాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌)తో తన ప్రయాణం గుర్తుంచుకోదగినది కాదన్నాడు. ఫ్రాంఛైజీ నుంచి తనకు ఎలాంటి మద్దతూ లభించలేదని ఆరోపించాడు.

ఒక్క మ్యాచ్‌.. చేదు అనుభవం
కాగా 2023 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు రూ. 50 లక్షల కనీస ధరకు కేకేఆర్‌ లిటన్‌ దాస్‌ను కొనుగోలు చేసింది. చాన్నాళ్లపాటు బెంచ్‌కే పరిమితమైన అతడు.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అరంగేట్రం చేశాడు.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన లిటన్‌ దాస్‌ (Liton Das).. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి అవుటయ్యాడు. ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో లలిత్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

ఇక వికెట్‌ కీపర్‌గానూ లిటన్‌ దాస్‌ విఫలమయ్యాడు. రెండుసార్లు స్టంపింగ్‌ చేసే అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓటమిపాలైంది.

నాకెలాంటి మద్దతూ లభించలేదు
ఆ తర్వాత లిటన్‌ దాస్‌కు మళ్లీ ఆడే అవకాశం రాలేదు. ఈ విషయాల గురించి బంగ్లాదేశ్‌ క్రికెట్‌​ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘కేకేఆర్‌కు నా అవసరం ఉందని అస్సలు అనుకోలేదు. ఆశించిన విధంగా జట్టు నుంచి నాకెలాంటి మద్దతూ లభించలేదు. ఒక మ్యాచ్‌లో ప్లేయర్‌ను ఆడిస్తున్నామంటే ముందుగానే సమాచారం ఇస్తారు.

రాత్రి 11 గంటలకు మెసేజ్‌
కానీ నా విషయంలో అలా జరుగలేదు. రెండు మ్యాచ్‌లలో నన్ను బెంచ్‌ మీదే కూర్చోబెట్టారు. అకస్మాత్తుగా రాత్రి 11 గంటలకు నాకో మెసేజ్‌ వచ్చింది. ‘నువ్వు ఆడబోతున్నావు’ అని చెప్పారు. అప్పటికప్పుడు ఎలా సన్నద్ధం కావాలో అర్థం కాలేదు. 

నా శాయశక్తులా బాగా ఆడేందుకు ప్రయత్నించా. అయితే, క్రికెట్‌లో ఒక్కోసారి మనం అనుకున్నవన్నీ జరుగకపోవచ్చు. ఆరోజు నాది కాదంతే’’ అని లిటన్‌ దాస్‌ నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ కేకేఆర్‌ యాజమాన్యంపై ఆరోపణలు చేశాడు.

కాగా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, జూహీ చావ్లా, జై మెహతా తదితరులు కేకేఆర్‌ సహ యజమానులు. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను కేకేఆర్‌ కొనుగోలు చేసింది.

హైడ్రామా
అయితే, భారత్‌- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో.. బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్‌ను కేకేఆర్‌ తొలగించింది. దీంతో బంగ్లా బోర్డు భద్రతా కారణాలు సాకుగా చూపుతూ టీ20 ప్రపంచకప్‌-2026 ఆడేందుకు తమ జట్టును భారత్‌కు పంపలేదు. వేదిక మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేయగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. 

దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు బంగ్లా ప్రకటించింది. తద్వారా భారీ మూల్యమే చెల్లించింది. ఇక కొత్తగా వచ్చిన ప్రభుత్వం బీసీసీఐతో సంబంధాల పునరుద్ధణ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాగా బంగ్లా ప్రపంచకప్‌ జట్టుకు లిటన్‌ దాస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

చదవండి: ఐపీఎల్‌ ఎక్కువైందా?.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement