హ్యాట్రిక్ కొట్టాడు.. ఇంకెన్ని దారుణాలు చూడాలో! | KKR Fans Troll Waste Of 25 Crores Cameron Green Useless For IPL 2026 | Sakshi
Sakshi News home page

Cameron Green: హ్యాట్రిక్ కొట్టాడు.. ఇంకెన్ని దారుణాలు చూడాలో!

Apr 7 2026 7:26 AM | Updated on Apr 7 2026 8:41 AM

KKR Fans Troll Waste Of 25 Crores Cameron Green Useless For IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఆట‌గాడు, ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ కామెరున్ గ్రీన్ వైఫ‌ల్యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో విఫ‌ల‌మై హ్యాట్రిక్ న‌మోదు చేశాడు. సోమ‌వారం కేకేఆర్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షార్ప‌ణమ‌యింది. ఓపెన‌ర్ ఫిన్ అలెన్ ఔటైన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన గ్రీన్ త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగించాడు. 

మొద‌టి బంతికి ఫోర్ కొట్టిన‌ప్ప‌టికీ ఆ మ‌రుస‌టి బంతికే ఔట‌య్యాడు. జేవియ‌ర్ బార్ట్‌లెట్ వేసిన అవుట్ స్వింగ‌ర్ బంతిని బ్యాట్‌తో ముద్దాడి కీప‌ర్ ప్ర‌భ్‌సిమ్ర‌న్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వ‌రుస‌గా 18, 2, 4 ప‌రుగులు సాధించాడు. మొత్తంగా ఈ సీజ‌న్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో గ్రీన్ కేవ‌లం 24 ప‌రుగులు మాత్ర‌మే చేసి 10 కంటే త‌క్కువ స‌గ‌టు న‌మోదు చేయ‌డం కోల్‌క‌తా మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా క‌ల‌వ‌ర‌పెడుతోంది. 

ఆల్‌రౌండ‌ర్‌గా జ‌ట్టుకు స‌మ‌తుల్య‌త ఇస్తాడ‌ని భావించి భారీ ధ‌ర పెట్టి కొనుగోలు చేసినందుకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఇప్ప‌టికే క్రికెట్ ఆస్ట్రేలియా సందేశం మేర‌కు బౌలింగ్‌కు దూరంగా ఉన్న కామెరున్ గ్రీన్ ఇప్పుడు బ్యాటింగ్‌లోనూ దారుణంగా ఆడుతూ అభిమానుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. రూ. 25.2 కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన గ్రీన్ ఇప్పుడు కేకేఆర్‌కు భారంగా మారిపోయాడు. 

క‌నీసం త‌ర్వాతి మ్యాచ్‌లోనైనా ఫుంజుకొని త‌న‌కు పెట్టిన ధ‌ర‌కు న్యాయం చేస్తాడేమో చూడాలి. మ‌రోవైపు కేకేఆర్ అభిమానులు మాత్రం గ్రీన్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కోట్లు పెట్టి కొనుక్కున్న కేకేఆర్‌కు పంగ‌నామం పెడుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వాస్త‌వానికి కామెరున్ గ్రీన్ పెద్ద ని ఖార్సైన ఆల్‌రౌండ‌ర్‌ కాద‌న్న సంగ‌తి అత‌ని గ‌ణాంకాలు చూస్తే స్ప‌ష్టంగా తెలుస్తోంది. 

ఆస్ట్రేలియా త‌ర‌ఫున 37 టెస్టులాడిన గ్రీన్ 1736 ప‌రుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచ‌రీలు, 7 అర్థ‌సెంచ‌రీలున్నాయి. 31 వ‌న్డేల్లో 782 ప‌రుగులు, 28 టీ20ల్లో 638 ప‌రుగులు సాధించాడు. ఈ మాత్రానికే కేకేఆర్ అంత డ‌బ్బులు పెట్టి గ్రీన్‌ను ఎందుకు కొనుగోలు చేసింద‌న్న‌ది ఇప్ప‌టికీ అంతుచిక్క‌ని ర‌హ‌స్యం. 

ఇక వ‌ర్షం ప‌డే స‌మయానికి కేకేఆర్ 3.4 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 25 ప‌రుగులు చేసింది. వ‌ర్షం తెరిపినిచ్చిన‌ప్ప‌టికీ ఔట్‌ఫీల్డ్ చిత్త‌డిగా మార‌డంతో మ్యాచ్ నిర్వ‌హ‌ణ క‌ష్ట‌మైంది. దీంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేసిన అంపైర్లు ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్ కేటాయించారు. ప్ర‌స్తుతం పంజాబ్ కింగ్స్ 5 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉంటే, సీజ‌న్‌లో ఇప్ప‌టికీ బోణీ చేయ‌ని కేకేఆర్ ఒక పాయింట్‌తో 8వ స్థానంలో కొన‌సాగుతుంది.

చదవండి: ‘ఇష్టం లేక‌పోతే త‌ప్పుకో’.. సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement