వరుణ్ చక్రవర్తి, రసెల్
భారత్‌లో చక్కగా సాగిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యూఏఈలో మాత్రం పేలవంగా ఆరంభించింది. కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌లాంటి సూపర్ హిట్టర్లున్న జట్టు కనీసం వంద పరుగులైనా చేయలేకపోయింది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మాత్రం ధనాధన్ షోతో మ్యాచ్‌ను ముగించింది. మొదట స్పిన్–పేస్ బౌలింగ్ కలయికతో ప్రత్యర్థి ఆటకట్టించిన నైట్‌రైడర్స్ లక్ష్యాన్ని మెరుపువేగంతో ఛేదించింది.
అబుదాబి: ఐపీఎల్–14 సీజన్ రెండో అంచెలో కోల్‌కతా నైట్‌రైడర్స్ బెబ్బులిలా పంజా విసిరింది. కోహ్లి సేనకు ఊహించని షాక్ ఇచ్చింది. బౌలింగ్‌లో వందలోపే కట్టడి చేసిన మోర్గాన్ బృందం బ్యాటింగ్‌లో 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. దీంతో 20–20 ఓవర్ల ఆట కాస్తా 29 ఓవర్లలోనే ముగిసింది. సోమవారం ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19 ఓవర్లలో 92 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ చేసిన 22 (20 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులే వారి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్. రసెల్ (3/9)) నిప్పులు చెరిగే స్పెల్‌తో... వరుణ్ చక్రవర్తి (3/13) తిప్పేసే మ్యాజిక్‌తో కోహ్లి సేన చేష్టలుడిగింది. తర్వాత కోల్‌కతా 10 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 94 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (27 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. వరుణ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
కోహ్లి 5, డివిలియర్స్ 0
బెంగళూరు దళానికి బ్యాటింగే బలం. అందులోనూ కోహ్లి, డివిలియర్స్‌ల బ్యాట్ల నుంచి జాలువారే పరుగులు, సిక్సర్లు అభిమానులకు కనువిందు. కానీ... సోమవారం కోల్‌కతా కసి ముందు ఎవరి ఆటలు సాగలేదు. మ్యాక్స్‌వెల్ రూపంలో జట్టుకు మరో మెరుపు వీరుడు జతయినప్పటికీ నైట్‌రైడర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు మొత్తం బెంగళూరు ఇన్నింగ్సే చెల్లాచెదురైంది. రెండో ఓవర్లోనే కోహ్లి (5) ఔటయ్యాడు. పవర్‌ప్లేలో పడిక్కల్ పెవిలియన్ చేరాడు. 6 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 41/2 స్కోరుతో బాగానే కనిపించింది. 9వ ఓవర్ వేసేందుకు రసెల్ వచ్చాక, స్పిన్నర్ వరుణ్ మ్యాజిక్ మొదలయ్యాక బెంగళూరు ఒక్కసారిగా కుదేలైంది. రసెల్ తన తొలి ఓవర్లోనే భరత్ (16), డివిలియర్స్ (0)ను ఔట్ చేశాడు. వరుణ్ కూడా తన సహచరుడినే ఫాలో అయ్యాడు. మ్యాక్స్‌వెల్ (10), హసరంగ (0)ను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. ఇలా 8 వికెట్లను 41 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.
ఓపెనర్లే చితగ్గొట్టారు...
అవతలివైపు ఆపసోపాలు పడి చేసిన పరుగుల్ని ఇవతలివైపు ఇద్దరంటే ఇద్దరే బాదేశారు. కోల్‌కతా ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ పోటీపడి మరీ బౌండరీలు బాదేశారు. దీంతో బెంగళూరు బౌలర్లు అలసిపోకుండా సగం కోటా (ఐదుగురు తలా 2 ఓవర్లు వేశారు)లోనే లక్ష్యం పూర్తయ్యింది. పదో ఓవర్లో గిల్ ఔటైనా... కావాల్సిన 11 పరుగుల్ని మూడు బౌండరీలతో వెంకటేశ్ అదే ఓవర్లో పూర్తి చేయడంతో రసెల్‌కు బంతిని ఎదుర్కొనే అవకాశమే చిక్కలేదు.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (ఎల్బీ) (బి) ప్రసిధ్ కృష్ణ 5; పడిక్కల్ (సి) దినేశ్ కార్తీక్ (బి) ఫెర్గూసన్ 22; శ్రీకర్ భరత్ (సి) గిల్ (బి) రసెల్ 16; మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ 10; డివిలియర్స్ (బి) రసెల్ 0; సచిన్ బేబీ (సి) నితీశ్ (బి) వరుణ్ 7; హసరంగ (ఎల్బీ) (బి) వరుణ్ 0; జేమీసన్ (రనౌట్) 4; హర్షల్ పటేల్ (బి) ఫెర్గూసన్ 12; సిరాజ్ (సి) వరుణ్ (బి) రసెల్ 8; చహల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 92. వికెట్ల పతనం: 1–10, 2–41, 3–51, 4–52, 5–63, 6–63, 7–66, 8–76, 9–83, 10–92. బౌలింగ్: వరుణ్ చక్రవర్తి 4–0–13–3, ప్రసిధ్ కృష్ణ 4–0–24–1, ఫెర్గూసన్ 4–0–24–2, నరైన్ 4–0–20–0, రసెల్ 3–0– 9–3. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) సిరాజ్ (బి) చహల్ 48; వెంకటేశ్ (నాటౌట్) 41; రసెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (10 ఓవర్లలో వికెట్ నష్టానికి) 94. వికెట్ పతనం: 1–82. బౌలింగ్: సిరాజ్ 2–0–12–0, జేమీసన్ 2–0–26–0, హసరంగ 2–0–20–0, చహల్ 2–0–23–1, హర్షల్ పటేల్ 2–0–13–0.
Comments
Please login to add a commentAdd a comment