Shreyas Iyer: వరల్డ్‌కప్‌లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ! | KL And I Played important role In ODI WC: Shreyas Iyer On Place In CT 2025 Squad | Sakshi
Sakshi News home page

CT 2025: వరల్డ్‌కప్‌లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ: శ్రేయస్‌ అ‍య్యర్‌

Published Mon, Jan 13 2025 1:14 PM | Last Updated on Mon, Jan 13 2025 2:39 PM

KL And I Played important role In ODI WC: Shreyas Iyer On Place In CT 2025 Squad

చాంపియన్స్‌ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనే జట్టులో తాను తప్పక చోటు దక్కించుకుంటాననే ధీమా వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తాను ఏ స్థానంలోనైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

కాగా గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్‌ సందర్భంగా శ్రేయస్‌ అయ్యర్‌ చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఐపీఎల్‌తో పాటు దేశీ క్రికెట్‌కే పరిమితమైన ఈ ముంబై బ్యాటర్‌.. 2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా జట్టుకు టైటిల్‌ అందించాడు. అంతేకాదు.. రంజీ ట్రోఫీ, ఇరానీ కప్‌ గెలిచిన జట్లలో సభ్యుడు.

అదే విధంగా తన కెప్టెన్సీలో ముంబైకి దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ అందించాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలోనూ దుమ్ములేపాడు. రెండు భారీ శతకాలతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్‌ ట్రోఫీకి అయ్యర్‌ ఎంపిక కావడం లాంఛనప్రాయమే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

వరల్డ్‌కప్‌లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ!
ఈ క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. వన్డే వరల్డ్‌ప్‌-2023 ప్రదర్శన ఆధారంగా తనకు చాంపియన్స్‌ ట్రోఫీలోనూ ఆడే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘నేను ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాను.

గత వరల్డ్‌కప్‌ టోర్నీలో నేను, కేఎల్‌ రాహుల్‌(KL Rahul) మిడిలార్డర్‌లో కీలక పాత్ర పోషించాం. మా ఇద్దరికీ ఆ ఈవెంట్‌ అద్భుతంగా సాగింది. అయితే, దురదృష్టవశాత్తూ ఫైనల్లో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయాం. 

ఏదేమైనా చాంపియన్స్‌ ట్రోఫీ ఆడే టీమిండియాకు ఎంపికైతే నాకు అంతకంటే గర్వకారణం మరొకటి ఉండదు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు.

రెండు శతకాలు బాది
కాగా భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఈవెంట్లో శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగో స్థానంలో.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేశారు. ఈ టోర్నమెంట్లో మిడిలార్డర్‌లో బరిలోకి దిగిన అయ్యర్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పదకొండు ఇన్నింగ్స్‌లో కలిపి ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ సగటు 66.25తో 530 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, మూడు హాఫ్‌ సెంచరీలు ఉండటం విశేషం.

ఫైనల్లో మాత్రం విఫలం
అయితే, అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో(India vs Australia) మాత్రం అయ్యర్‌ తేలిపోయాడు. ఆసీస్‌ కెప్టెన్‌, పేస్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో జోష్‌ ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. మరోవైపు.. ఈ మెగా టోర్నీలో కేఎల్‌ రాహుల్‌ 452 పరుగులు సాధించాడు. ఫైనల్లో 66 పరుగులు చేసి.. టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

పంజాబ్‌ కెప్టెన్‌గా
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో శ్రేయస్‌ అయ్యర్‌పై కాసుల వర్షం కురిసిన విషయం తెలిసిందే. గతేడాది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ట్రోఫీ అందించిన ఈ ఆటగాడి కోసం పంజాబ్‌ కింగ్స్‌ భారీ మొత్తం ఖర్చు పెట్టింది. ఏకంగా రూ. 26.75 కోట్లకు అయ్యర్‌ను సొంతం చేసుకుంది. 

ఫలితంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా శ్రేయస్‌ అయ్యర్‌ నిలిచాడు. ఇక అతడిని తమ కెప్టెన్‌గా ప్రకటిస్తూ పంజాబ్‌ కింగ్స్‌ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఐపీఎల్‌-2025లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమిండియా సూపర్‌స్టార్‌ రిషభ్‌ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ మెగా లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ చరిత్రకెక్కాడు.

చదవండి: చాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆరోజే: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement