ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) సమయం సమీపిస్తోంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలుకానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ తదితర బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాత్రం ఇంత వరకు ఈ టోర్నీలో పాల్గొనే సభ్యుల పేర్లు వెల్లడించలేదు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా(Rajiv Shukla) కీలక అప్‌డేట్ అందించారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును ఈనెల 18 లేదా 19వ తేదీల్లో ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా 2017లో టైటిల్ గెలిచిన పాకిస్తాన్.. చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.
భద్రతా కారణాల దృష్ట్యా
అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో అనేక చర్చోపచర్చల అనంతరం ఐసీసీ ఆదేశాల మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది. దీని ప్రకారం భారత జట్టు తమ మ్యాచ్‌లను తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడనుంది.
ఇక తమ తొలి మ్యాచ్‌లో భాగంగా భారత్ ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. కాగా ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి.
ఇక వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో ఆసీస్‌తో పాటు టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. మరోవైపు.. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో సెమీ ఫైనల్ కూడా చేరలేకపోయిన పాకిస్తాన్.. సొంతగడ్డపై జరిగే చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారీ అంచనాలతో ముందుకు రానుంది. ఆసీస్‌ను వారి స్వదేశంలో వన్డే సిరీస్‌లో ఓడించడంతో పాటు.. సౌతాఫ్రికా గడ్డపై ఇంత వరకూ ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో ప్రొటిస్ జట్టును వన్డే సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్ చేసి జోరు మీదుంది.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025
గ్రూప్-‘ఎ’- ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా
గ్రూప్-‘బి’- ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్
డబ్ల్యూపీఎల్ వేదికలు ఎంపిక చేశాం
ఇదిలా ఉంటే..వచ్చే నెల 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభం కానుంది. గతేడాది రెండు (లక్నో, బరోడా) వేదికల్లో ఈ లీగ్ నిర్వహించగా... ఈ సారి నాలుగు నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి 2న డబ్ల్యూపీఎల్ ఫైనల్ జరగనుండగా... అదే నెల 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.
ఇక మే 25న ఐపీఎల్ తుదిపోరుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఆతిథ్యమివ్వనుంది. 2024 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ట్రోఫీ చేజిక్కించుకోవడంతో... తొలిపోరు కూడా అక్కడే జరగనుంది.
బీసీసీఐ కొత్త కార్యదర్శి అతడే
ఈ సమావేశంలో బోర్డు కార్యదర్శిగా దేవజిత్ సైకియా(Devjith Saikiya), కోశాధికారిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులకు వీరిద్దరే దరఖాస్తు చేసుకోవడంతో ఎన్నిక అవసరం లేకుండా పోయిందని... ఎన్నికల అధికారి వెల్లడించారు.
మరోవైపు.. డబ్ల్యూపీఎల్ వేదికల ఎంపిక గురించి రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. అతి త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగానే చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎప్పుడు ప్రకటిస్తామనే విషయాన్ని కూడా రాజీవ్ శుక్లా తెలిపారు.
చదవండి: CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు
Comments
Please login to add a commentAdd a comment