రాహుల్‌, పడిక్కల్‌ అద్భుత శతకాలు | KL rahul and devdutt padikkal slams hundreds in ranji trophy semi final against uttarakhand | Sakshi
Sakshi News home page

రాహుల్‌, పడిక్కల్‌ అద్భుత శతకాలు

Feb 15 2026 3:00 PM | Updated on Feb 15 2026 3:45 PM

KL rahul and devdutt padikkal slams hundreds in ranji trophy semi final against uttarakhand

ఉత్తరాఖండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 15) మొదలైన రంజీ ట్రోఫీ 2025-26 తొలి సెమీఫైనల్లో కర్ణాటక జట్టు భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (125 నాటౌట్‌), కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌ (111 నాటౌట్‌) అద్భుత సెంచరీలతో చెలరేగిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న కర్ఱాటక టీ విరామం సమయానికి వికెట్‌ నష్టానికి 263 పరుగులు చేసింది. రాహుల్‌, పడిక్కల్‌ సెంచరీల తర్వాత కూడా నిలకడగా ఆడుతూ డబుల్‌ సెంచరీల దిశగా సాగుతున్నారు.

టాస్‌ ఓడి ఉత్తరాఖండ్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 18 పరుగుల వద్దనే ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (5) వికెట్‌ కోల్పోయింది. అయితే రాహుల్‌, పడిక్కల్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అజేయమైన 245 పరుగులు జోడించారు. మయాంక్‌ అగర్వాల్‌ వికెట్‌ ఆదిత్య రావత్‌కు దక్కింది.

భీకర ఫామ్‌లో రాహుల్‌, పడిక్కల్‌
కేఎల్‌ రాహుల్‌, దేవదత్‌ పడిక్కల్‌ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. టీమిండియా షెడ్యూల్‌ లేకపోవడంతో రంజీ బాట పట్టిన రాహుల్‌ ముంబైతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లోనూ (130) అద్భుత శతకంతో మెరిశాడు. రాహుల్‌ అద్భుత శతకం కారణంగానే కర్ణాటక ముంబైపై గెలిచి సెమీస్‌కు చేరింది. అంతకుముందు పంజాబ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లోనూ రాహుల్‌ అర్ద సెంచరీతో రాణించాడు. దీనికి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన రాజ్‌కోట్‌ వన్డేలోనూ (112) రాహుల్‌ అజేయ శతకంతో సత్తా చాటాడు. అంతకుముందు సౌతాఫ్రికాపై వరుసగా రెండు వన్డేల్లో అర్ద సెంచరీలతో రాణించాడు.

పడిక్కల్‌ విషయానికొస్తే.. ఇతను కూడా ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు. ఈ సెంచరీకి ముందు పంజాబ్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన పడిక్కల్‌.. దానికి ముందు లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో పరుగుల వరద పారించాడు. పుదుచ్చేరి, త్రిపురపై వరుస శతకాలు, ఆతర్వాత రాజస్థాన్‌పై 91, ముంబైపై 81 (నాటౌట్‌) పరుగులు చేశాడు. రాహుల్‌, పడిక్కల్‌ ఇదే భీకర ఫామ్‌ను కొనసాగిస్తే.. కర్ణాటక మరోసారి రంజీ టైటిల్‌ గెలవడం ఖాయం. 

Advertisement
 
Advertisement
Advertisement