టీమిండియా వైస్ కెప్టెన్.. ఓపెనర్ కేఎల్ రాహుల్ కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఆసియా కప్‌లో కేఎల్ రాహుల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా రాహుల్ స్ట్రైక్‌రేట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. పవర్ ప్లే లో ఒకవైపు కెప్టెన్ రోహిత్ శర్మ రెచ్చిపోతుంటే రాహుల్ మాత్రం మరీ నెమ్మదిగా ఆడుతున్నాడంటూ విమర్శలు వచ్చాయి.
ఆసియా కప్‌లో ఐదు మ్యాచ్‌లాడిన రాహుల్ 0, 36, 28, 6, 62 పరుగులు చేయగా.. స్ట్రైక్ రేట్ 122.22గా ఉంది. తాజాగా కేఎల్ రాహుల్ తన ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో మొహాలీలో తొలి టీ20కి ముందు నిర్వహించిన మీడియాతో మాట్లాడాడు.
''స్ట్రైక్రేట్ విషయంలో నన్ను విమర్శిస్తున్నారు దానిపై ప్రతిఒక్కరూ మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంలో ఎవరూ పరిపూర్ణులు కాదు. డ్రెస్సింగ్ రూమ్ లోని ప్రతీ ఆటగాడు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. అయితే స్ట్రైక్రేట్ అనేది కొన్ని మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుని గణించేది కాదు. ఒక బ్యాటర్ ఎప్పుడూ ఒకే స్ట్రైక్ రేట్ తో ఆడటం కష్టం. ఒక ఆటగాడు 200 స్ట్రైక్ రేట్ తో ఆడాలా..? లేక 100-120 తో ఆడాలా..? అని విశ్లేషించడం నా దృష్టిలో తప్పు.
మొత్తంగా చూసుకుంటే స్ట్రైక్ రేట్ ఎలా ఉందనేది ముఖ్యం. అయినా సరే.. నేను నా స్ట్రైక్ రేట్ మీద పని చేస్తూనే ఉన్నా. టి20 ప్రపంచకప్ కోసం గత 10-12 నెలలుగా జట్టులో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంది. అందుకోసమే అందరూ కృషి చేస్తున్నారు. జట్టు తమ నుంచి ఏం కోరుకుంటుందనే దానిపై అందరికీ స్పష్టమైన అవగాహన ఉంది. అలాగే నేను కూడా జట్టుకు ఏ విధంగా ఉపయోగపడాలన్న దానిమీద.. నన్ను నేను మరింత మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నా'' అని తెలిపాడు.
చదవండి: పార్థివ్ పటేల్ కీలక ఇన్నింగ్స్.. ఉత్కంఠ పోరులో గుజరాత్ జెయింట్స్ విజయం
Comments
Please login to add a commentAdd a comment