KL Rahul to lead India against New Zealand T20 Series: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో టీమిండియా దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైన కోహ్లి సేన... కీలకమైన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 8 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. దీంతో సెమీస్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, కోహ్లి సారథ్యం, మేనేజ్‌మెంట్ తీరుపై అభిమానులు మండిపడుతున్నారు.
మరోవైపు... కాసులు కురిపించే ఐపీఎల్ కోసం ఆటగాళ్లను తీవ్ర శ్రమకు గురిచేసి... మానసిక ప్రశాంతత లేకుండా చేసి ఐసీసీ టోర్నీలో ఫలితం అనుభవించేలా చేస్తున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మీడియాతో మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం బయోబబుల్‌లో ఉండటం ఇబ్బందిగా ఉందని చెప్పకనే చెప్పాడు.
తమకు విశ్రాంతి అవసరమని, నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండటం మానసిక ఉత్సాహాన్ని దెబ్బతీస్తుందని చెప్పుకొచ్చాడు. ఆటపై ఇది ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తిక వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది నవంబరులో న్యూజిలాండ్ భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే.
అతడే కెప్టెన్
మూడు టీ20 మ్యాచ్‌లు, 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్లకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు టీ20 కెప్టెన్సీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాం. టీ20 జట్టులో రాహుల్ కీలకంగా వ్యవహరిస్తాడు. సీనియర్ల గైర్హాజరీలో తను సారథ్య బాధ్యతలు చేపట్టడం ఖాయమే’’ అని పేర్కొన్నారు.
ఇక కోవిడ్ నేపథ్యంలో మైదానంలో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తారా అన్న ప్రశ్నకు బదులుగా.. స్థానిక అధికారులతో మాట్లాడి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత కోహ్లి టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టడం లాంఛనమే కాగా.. అతడికి డిప్యూటీగా కేఎల్ రాహుల్ వ్యవహరించే అవకాశం ఉంది.
చదవండి: Yuvraj Singh: గుడ్ న్యూస్ చెప్పిన యువరాజ్ సింగ్!
Comments
Please login to add a commentAdd a comment