
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వరుకూ భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి క్రికెట్ కెరీర్ పై ఎన్నో విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఘోర వైఫల్యం ఇందుకు ప్రధాన కారణం. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఒక్క మ్యాచ్ తో పరిస్థితి అంతా మారిపోయింది. గత ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ, భారత్ బ్యాటింగ్ లో తన మునుపటి వైభవాన్ని పునరుద్ధరించుకున్నాడు.
పాకిస్తాన్ మ్యాచ్ అంటే విజృంభించి ఆడే కోహ్లీ ఇవేమీ కొత్తేమీ కాదు. అయితే న్యూజిలాండ్‌తో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ కోహ్లీ కి చాల ప్రత్యేకం. ఇది కోహ్లీకి 300వ వన్డే మ్యాచ్. ఈ మైలురాయిని చేరుకున్న భారత్ ఆటగాళ్లలో కోహ్లీ ఏడవ వాడు. గతంలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని వంటి హేమాహేమీలు ఈ రికార్డ్ సాధించిన వారిలో ఉన్నారు.
రికార్డుల వేటలో కోహ్లి..
కోహ్లీ తన 300వ వన్డేకు చేరుకుంటున్న తరుణంలో, భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రశంసలతో ముంచెత్తాడు. భారత క్రికెట్‌పై కోహ్లీ ప్రభావం ఎంత ఉందో మాటల్లో చెప్పడానికి చాలా కష్టం అని రాహుల్ ప్రశంసలతో ముంచెత్తాడు. రాహుల్ కోహ్లీని తానూ క్రికెట్లో ఎల్లప్పుడూ ఆరాధించే "ముఖ్యమైన సీనియర్ ఆటగాడు" అని ప్రశంసించాడు. "300 వన్డే మ్యాచ్‌లు... కోహ్లీ భారత క్రికెట్‌కు ఎంత గొప్ప సేవకుడో వ్యక్తీకరించడానికి మాటలు సరిపోవు" అని రాహుల్ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించాడు.
కోహ్లీ ఈ మ్యాచ్ తో మరో రికార్డ్ సాధించాలన్న ఆశయంతో ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ న్యూజిలాండ్‌పై 3000 కంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరడానికి ఇంకా 85 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. గతంలో సచిన్ టెండూల్కర్ (3345), రికీ పాంటింగ్ (3145), జాక్వెస్ కల్లిస్ (3071) మరియు జో రూట్ (3068) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న ఐదవ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. న్యూజిలాండ్‌పై కోహ్లీ ఇంతవరకూ 55 వన్డే మ్యాచ్‌ల్లో 47.01 సగటుతో 2915 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు మరియు 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
కోహ్లీ పై బ్రేస్‌వెల్ ప్రశంసలు
"ఇది చాలా పెద్ద విజయం" అని ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ సైతం కోహ్లీ మైలురాయి గురించి ప్రశంసలు గుప్పించాడు. "ఒక క్రికెటర్ కెరీర్‌లో 300 వన్డే మ్యాచ్ లు ఆడటం చాల గొప్ప విషయం. అదీ ఒకే ఫార్మాట్‌లో. కోహ్లీ తన తన కెరీర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాడనే దానికి ఇది నిదర్శనం అని నేను భావిస్తున్నాను." అని బ్రేస్‌వెల్ వ్యాఖ్యానించాడు.
2023 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కోహ్లీతో కలిసి బ్రేస్‌వెల్ ఆడాడు. అతనికి కోహ్లీ గురించి ప్రత్యక్ష అవగాహన ఉంది. "ఆర్‌సిబిలో అతను ప్రతి మ్యాచ్‌కు ఎలా సిద్ధమయ్యాడో నేను ప్రత్యక్షంగా చూశాను. భారత్ జట్టు లో చాల మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. అందులో కోహ్లీ ఒకడు. భారత్ తో ఎదురయ్యే సవాలు ఎదుర్కోవటానికి మేము ఏంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం," అని బ్రెసెవెల్ అన్నాడు.
న్యూజిలాండ్ రికార్డ్
ఐసిసి టోర్నమెంట్లలో న్యూజిలాండ్ భారత్ పై ఆధిపత్యం చెలాయించింది. హెడ్-టు-హెడ్ రికార్డ్ లో న్యూజీలాండ్ 10-5 ( డబ్ల్యూ టి సి ఫైనల్‌తో సహా) తో ఆధిపత్యం లో ఉంది. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన వన్డేల్లో అయితే భారత్ 60-58 తో ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో భారత్ సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఆడటం అనుమానంగానే ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ షమీ కాలి మడమ నొప్పితో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.
ఈ కారణంగా షమీ స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను భారత్ ఈ మ్యాచ్ లో ఆడించే అవకాశముంది. న్యూజిలాండ్ లైనప్‌లో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్ ఉండటం కూడా ఇందుకు ఒక కారణం. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ పర్యవేక్షణలో అర్ష్‌దీప్ 13 ఓవర్లు ఫుల్ రన్-అప్‌తో బౌలింగ్ చేయగా, షమీ 6-7 ఓవర్లు మాత్రమే కుదించబడిన రన్-అప్‌తో బౌలింగ్ చేశాడు. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన మూడవ ఓవర్ వేసిన వెంటనే షమీ ఫిజియోల నుండి తన కుడి కాలుకు చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమైన సెమీ-ఫైనల్స్‌కు ముందు భారత్ షమీకి విరామం ఇచ్చే అవకాశం లేకపోలేదు.
చదవండి: యువీ స్పిన్ మ్యాజిక్.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
Comments
Please login to add a commentAdd a comment