ముంబైలో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా విజయం
24 పరుగులతో నెగ్గిన నైట్‌రైడర్స్
రాణించిన వెంకటేశ్ అయ్యర్, స్టార్క్
ముంబై: వాంఖెడే మైదానంలో 12 సంవత్సరాల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మెరిసింది. 2012లో చివరిసారిగా ఈ వేదికపై ముంబై ఇండియన్స్ జట్టును ఓడించిన కోల్‌కతా ఇప్పుడు మళ్లీ గెలుపు బావుటా ఎగురవేసింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో కేకేఆర్ 24 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది.
వెంకటేశ్ అయ్యర్ (52 బంతుల్లో 70; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... మనీశ్ పాండే (31 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ముంబై 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, కోల్‌కతా పేసర్ స్టార్క్‌కు 4 వికెట్లు దక్కాయి.
ఆదుకున్న వెంకటేశ్...
కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 6.1 ఓవర్లు ముగిసేసరికే సగం జట్టు అవుట్! తుషార బౌలింగ్ జోరుతో మొదలైన జట్టు పతనం వేగంగా సాగింది. తన తొలి ఓవర్లోనే సాల్ట్ (5)ను అవుట్ చేసి శుభారంభం అందించిన తుషార... రెండో ఓవర్లో రఘువంశీ (13), శ్రేయస్ అయ్యర్ (6)లను వెనక్కి పంపాడు.
పాండ్యా తొలి ఓవర్లోనే నరైన్ (8) కూడా పెవిలియన్ చేరగా, రింకూ సింగ్ (9) విఫలమయ్యాడు. ఈ దశలో వెంకటేశ్, పాండే కలిసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆశించిన స్థాయిలో భారీ షాట్లు కొట్టకపోయినా ఇన్నింగ్స్ కుప్పకూలిపోకుండా వీరు కాపాడారు. ఆరో వికెట్‌కు 62 బంతుల్లో 83 పరుగులు జత చేసిన అనంతరం పాండే వెనుదిరిగాడు.
సమన్వయలోపంతో రసెల్ (7) రనౌట్ కావడం చివరి ఓవర్లలో కేకేఆర్ స్కోరింగ్ అవకాశాలను దెబ్బ తీసింది. 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వెంకటేశ్ తర్వాతి 16 బంతుల్లో 20 పరుగులే చేయగా... ఆఖరి 5 ఓవర్లలో 41 పరుగులే చేసి నైట్‌రైడర్స్ 5 వికెట్లు చేజార్చుకుంది.
సూర్యకుమార్ అర్ధసెంచరీ...
ఛేదనలో ముంబై కూడా తడబడింది. కేకేఆర్ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఇషాన్ కిషన్ (13), నమన్ (11), రోహిత్ శర్మ (11) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 10 పరుగుల వ్యవధిలో తిలక్ వర్మ (4), నేహల్ వధేరా (6), హార్దిక్ పాండ్యా (1) కూడా వెనుదిరిగారు. అయితే ఈ దశలో సూర్యకుమార్ దూకుడైన బ్యాటింగ్ ముంబై విజయంపై ఆశలు రేపింది.
అరోరా వేసిన ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్ బాదిన సూర్య 30 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. విజయానికి 28 బంతుల్లో 50 పరుగులు కావాల్సిన స్థితిలో సూర్య అవుట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివర్లో టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) కొంత పోరాడినా లాభం లేకపోయింది. 19వ ఓవర్లో స్టార్క్ 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) తిలక్ (బి) తుషార 5; నరైన్ (బి) పాండ్యా 8; రఘువంశీ (సి) సూర్యకుమార్ (బి) తుషార 13; శ్రేయస్ (సి) డేవిడ్ (బి) తుషార 6; వెంకటేశ్ (బి) బుమ్రా 70; రింకూ సింగ్ (సి అండ్ బి) చావ్లా 9; పాండే (సి) (సబ్) బ్రెవిస్ (బి) పాండ్యా 42; రసెల్ (రనౌట్) 7; రమణ్‌దీప్ (సి) కొయెట్జీ (బి) బుమ్రా 2; స్టార్క్ (బి) బుమ్రా 0; అరోరా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 169. వికెట్ల పతనం: 1–7, 2–22, 3–28, 4–43, 5–57, 6–140, 7–153, 8–155, 9–155, 10–169. బౌలింగ్: తుషార 4–0–42–3, బుమ్రా 3.5–0–18–3, కొయెట్జీ 2–0–24–0, పాండ్యా 4–0–44–2, నమన్ 3–0–25–0, చావ్లా 3–0–15–1.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (బి) స్టార్క్ 13; రోహిత్ శర్మ (సి) పాండే (బి) నరైన్ 11; నమన్ (బి) వరుణ్ 11; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) రసెల్ 56; తిలక్ (సి) నరైన్ (బి) వరుణ్ 4; వధేరా (బి) నరైన్ 6; పాండ్యా (సి) పాండే (బి) రసెల్ 1; డేవిడ్ (సి) శ్రేయస్ (బి) స్టార్క్ 24; కొయెట్జీ (బి) స్టార్క్ 8; చావ్లా (సి) నరైన్ (బి) స్టార్క్ 0; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 145. వికెట్ల పతనం: 1–16, 2–38, 3–46, 4–61, 5–70, 6–71, 7–120, 8–144, 9–144, 10–145.
బౌలింగ్: అరోరా 3–0–35–0, స్టార్క్ 3.5–0–33–4, వరుణ్ 4–0–22–2, నరైన్ 4–0–22–2, రసెల్ 4–0–30–2.
ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు X గుజరాత్
వేదిక: బెంగళూరు
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment