‘ప్లేఆఫ్స్‌’కు కోల్‌కతా | Kkr Win over Mumbai by 18 runs | Sakshi
Sakshi News home page

‘ప్లేఆఫ్స్‌’కు కోల్‌కతా

Published Sun, May 12 2024 4:43 AM | Last Updated on Sun, May 12 2024 7:02 AM

Kkr Win over Mumbai by 18 runs

18 పరుగులతో ముంబైపై గెలుపు 

రాణించిన వెంకటేశ్, వరుణ్‌  

కోల్‌కతా: ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ‘ప్లే ఆఫ్స్‌’ చేరిన తొలి జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిలిచింది. శనివారం జరిగిన పోరులో కోల్‌కతా 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. భారీ వర్షం వల్ల మ్యాచ్‌ చాలా ఆలస్యంగా మొదలవడంతో 16 ఓవర్లకు కుదించారు. ముందుగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

 వెంకటేశ్‌ అయ్యర్‌ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితీశ్‌ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు. అనంతరం ముంబై ఇండియన్‌ 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. ఇషాన్‌ కిషన్‌ (22 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌వర్మ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.  

మెరిపించిన వెంకటేశ్‌ 
ఇన్నింగ్స్‌ తొలిబంతికే సిక్సర్‌ బాదిన సాల్ట్‌ (6)ను ఐదో బంతికే తుషార అవుట్‌ చేయగా, మరో ప్రమాదకర ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ (0) బుమ్రా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.  బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో వెంకటేశ్‌ 4, 6, 4 బాదాడు. కానీ మరుసటి ఓవర్లోనే కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (7)ను అన్షుల్‌ బౌల్డ్‌ చేసి ముంబై శిబిరాన్ని మురిపించాడు. 

పవర్‌ప్లే 5 ఓవర్లలో నైట్‌రైడర్స్‌ 45/3 స్కోరు చేసింది. ఆరో ఓవర్లో జట్టు స్కోరు 50 దాటగా... నితీశ్‌ రాణా, వెంకటేశ్‌ల దూకుడుతో కోల్‌కతా ఇన్నింగ్స్‌ పుంజుకుంది. వెంకటేశ్‌ ధాటికి చావ్లా అడ్డుకట్ట వేయగా, రసెల్‌ (14 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాకతో నైట్‌రైడర్స్‌ 10.2 ఓవర్లలో వంద పరుగులు దాటింది. 

అడపాదడపా బౌండరీలతో జట్టు స్కోరును పెంచుతున్న నితీశ్‌ రాణాను తిలక్‌ వర్మ చక్కని త్రో రనౌట్‌ చేయగా, ఓవర్‌ వ్యవధిలో రసెల్‌ మెరుపులకు చావ్లా కళ్లెం వేశాడు. తర్వాత ఆఖరి ఓవర్లలో రింకూ సింగ్‌ (12 బంతుల్లో 20; 2 సిక్స్‌లు), రమణ్‌దీప్‌ సింగ్‌ (8 బంతుల్లో 17 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌)లు కూడా ధాటిని ప్రదర్శించడంతో ప్రత్యర్థి ముందు కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది.  

రాణించిన ఇషాన్‌ 
ఓపెనర్లు ఇషాన్‌ కిషన్, రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్‌) ముంబైకి చక్కని ఆరంభాన్నే ఇచ్చారు. ఓ వైపు రోహిత్‌ కుదురుగా ఆడుతుంటే మరోవైపు కిషన్‌ చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో స్కోరు వేగాన్ని పెంచాడు. 5 ఓవర్ల పవర్‌ప్లేలో ముంబై 59/0 స్కోరు చేసింది.

అయితే ఇంత చక్కని శుభారంభానికి కోల్‌కతా స్పిన్నర్లు తూట్లు పొడిచారు. వరుస ఓవర్లలో నరైన్, ఇషాన్‌ను... రోహిత్‌ను వరుణ్‌ అవుట్‌ చేయడంతో ముంబై రూటు మారింది. రసెల్‌ బంతినందుకొని హిట్టర్లు సూర్యకుమార్‌ (11), టిమ్‌ డేవిడ్‌ (0)లను అవుట్‌ చేయడంతోనే ముంబై లక్ష్యానికి దూరమైంది.  

స్కోరు వివరాలు 
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) అన్షుల్‌ (బి) తుషార 6; నరైన్‌ (బి) బుమ్రా 0; వెంకటేశ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) చావ్లా 42; శ్రేయస్‌ (బి) అన్షుల్‌ 7; నితీశ్‌ రనౌట్‌ 33; రసెల్‌ (సి) అన్షుల్‌ (బి) చావ్లా 24; రింకూ సింగ్‌ (సి) ఇషాన్‌ (బి) బుమ్రా 20; రమణ్‌దీప్‌ నాటౌట్‌ 17; స్టార్క్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16 ఓవర్లలో 7 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–6, 2–10, 3–40, 4–77, 5–116, 6–125, 7–148. బౌలింగ్‌: తుషార 3–0–31–1, బుమ్రా 4–0–39–2, అన్షుల్‌ 3–0–24–1, హార్దిక్‌ 3–0–32–0, పియూశ్‌ చావ్లా 3–0–28–2. 

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి) రింకూ (బి) నరైన్‌ 40; రోహిత్‌ (సి) నరైన్‌ (బి) వరుణ్‌ 19; సూర్యకుమార్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) రసెల్‌ 11; తిలక్‌వర్మ (సి) సాల్ట్‌ (బి) హర్షిత్‌ 32; హార్దిక్‌ (సి) వైభవ్‌ (బి) వరుణ్‌ 2; డేవిడ్‌ (సి) శ్రేయస్‌ (బి) రసెల్‌ 0; నేహల్‌ రనౌట్‌ 3; నమన్‌ (సి) రింకూ (బి) హర్షిత్‌ 17; అన్షుల్‌ నాటౌట్‌ 2; చావ్లా నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో 8 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–65, 2–67, 3–87, 4–91, 5–92, 6–117, 7–136, 8–137 బౌలింగ్‌: వైభవ్‌ 2–0–16–0, స్టార్క్‌ 1–0–11–0, హర్షిత్‌ 3–0–34–2, నరైన్‌ 3–0–21–1, వరుణ్‌ 4–0–17–2, రసెల్‌ 3–0–34–2. 
 
ఐపీఎల్‌లో నేడు
చెన్నై X రాజస్తాన్‌
వేదిక: చెన్నై
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి 
బెంగళూరు X ఢిల్లీ
వేదిక: బెంగళూరు
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement