విశాఖ స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విశాఖ నుంచి ప్రాతినిధ్యం లభించింది. ఢిల్లీ కాపిటల్స్ తరఫున ఆడేందుకు కేఎస్ భరత్ సిద్ధమవుతుండగా...మ్యాచ్‌లకు అంపైర్‌గా సీహెచ్ రవికాంత్ బయలుదేరనున్నారు. భరత్‌కు ఇప్పటికే ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తరఫున ఆడిన అనుభవం ఉంది. బీసీసీఐ పానెల్ అంపైర్ రవికాంత్ మాత్రం తొలిసారిగా ఐపీఎల్ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన వీరిద్దరికి క్రికెట్ సంఘం ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
ఈసారి ఢిల్లీ కాపిటల్స్ తరఫున
ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ కె. శ్రీకర్ భరత్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్‌లో ఆడనున్నాడు. రంజీల్లో ట్రిపుల్ సెంచరీ, వికెట్ కీపర్ బాటర్‌గా రికార్డు సాధించి భరత్ తొలిసారిగా 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తరఫున ఐపీఎల్ మ్యాచ్‌లాడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌కు తొలిసారిగా జట్టుకూర్పులో స్థానం సాధించాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలకు ఎంపికైనా జాతీయ జట్టు తరఫున పూర్తిస్థాయిలో ఆడే అవకాశం దక్కలేదు. ఇటీవలే న్యూజిలాండ్‌తో ఆడిన టెస్ట్ మ్యాచ్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా జట్టు తరఫున ఆడాడు.
ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక సిరీస్‌లోనూ జట్టుతోనే ఉన్నాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం మరోసారి ఆడేందుకు అహ్వానం అందుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ తరఫున చివరి బంతిని గాల్లో బౌండరీకి తరలించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో ఐపీఎల్‌లోనూ భరత్‌కు మంచి గుర్తింపు వచ్చింది. సిక్సర్‌ను ఢిల్లీ కాపిటల్స్ జట్టుపైనే సాధించగా...ఈసారి ఆదే ఢిల్లీ కేపిటల్స్ తరఫున జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. టీ20 మ్యాచ్‌ల్లోనూ అర్ధసెంచరీ నమోదు చేసిన భరత్ వికెట్ల వెనుక నిలబడి 29 స్టంపింగ్స్ చేశాడు.
ప్యానెల్ అంపైర్‌గా 250 మ్యాచ్‌లు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ల్లో 250 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన సీహెచ్ రవికాంత్ తొలిసారిగా ఐపీఎల్‌లో అంపైరింగ్‌కు ఆహ్వానం అందుకున్నాడు. పలు టీ20 మ్యాచ్‌లు అంపైరింగ్ చేశారు. తొలిసారి జిల్లా ప్యానల్ అంపైర్‌గా పిచ్‌పైకి వచ్చిన రవికాంత్ అనతికాలంలోనే అనంతపురంలో తొలిసారిగా స్టేట్ ప్యానల్ అంపైర్ అయ్యారు. ఇక 2008లో బీసీసీఐ ప్యానల్ అంపైర్ కావడంతో దేశవాళీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసే స్థాయికి ఎదిగారు.
2015 నుంచి రంజీల్లో 39 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. తొలిసారిగా ఇండియా ఏతో తలపడిన న్యూజిలాండ్ ఏ నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేయడంతో అంతర్జాతీయ మ్యాచ్ అరంగేట్రం జరిగింది. దక్షిణాఫ్రికా అండర్–19 జట్టుతో భారత్ ఆడిన మ్యాచ్‌లకు, మహిళల దక్షిణాఫ్రికా–భారత్ టీ20 సిరీస్‌కు అంపైరింగ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment