అడిలైడ్ టెస్ట్ సందర్భంగా టీమిండియా పేసర్ మొహహ్మద్ సిరాజ్- ఆసీస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ మధ్య జరిగిన ఫైట్ గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశంపై గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో భారీ ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు సిరాజ్ అతి చేశాడని అంటుంటే, మరికొందరు హెడ్‌ను తప్పుబడుతున్నాడు. ఏదిఏమైనప్పటికీ ఐసీసీ ఇద్దరిపై చర్యలు తీసుకుంది. హెడ్‌కు ఓ డీ మెరిట్ పాయింట్ ఇవ్వగా.. సిరాజ్‌కు డీ మెరిట్ పాయింట్‌తో పాటు 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడింది.
సిరాజ్-హెడ్ గొడవపై సోషల్‌మీడియాలో డిబేట్లు జరుగుతున్నప్పటికీ వారిద్దరూ మ్యాచ్ జరుగుతుండగానే రాజీ పడ్డారు. ఒకరినొకరు కౌగిలించుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాడు. హెడ్ చేసిన వ్యాఖ్యలను తాను తప్పుగా అర్దం చేసుకున్నానని సిరాజ్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ గొడవలో సిరాజ్ తప్పు ఎంతన్నది పక్కన పెడితే, అతని ఆన్ ఫీల్డ్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సిరాజ్‌ను తప్పుబట్టే వారిలో టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా చేరిపోయాడు.
హెడ్ పట్ల సిరాజ్‌ది పిచ్చి ప్రవర్తన అని దుయ్యబట్టాడు. హెడ్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసినందుకు అభినందించాల్సి పోయి అతనితో వాగ్వాదానికి దిగడం ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ శ్రీకాంత్ ఇలా అన్నాడు.
హే సిరాజ్.. హెడ్ నీ బౌలింగ్‌ను నిర్దాక్షిణ్యంగా ఛేదించాడు. అతను నీ బౌలింగ్‌ను ఎడాపెడా వాయించాడు. నీ బౌలింగ్‌లో బౌండరీలు, సిక్సర్లు అలవోకగా కొట్టగలిగాడు. ఇందుకు సిగ్గు పడాల్సింది పోయి.. అతనికి సెండ్ ఆఫ్ ఇస్తావా..? అసలు నీకు బుద్ధి ఉందా..? పిచ్చి పట్టినట్లు ప్రవర్తించావు. దీన్ని స్లెడ్జింగ్ అంటారా? ఇది కేవలం పిచ్చి మాత్రమే అని అన్నాడు.
హెడ్‌ను అగౌరవపరిచినందుకు శ్రీకాంత్ సిరాజ్‌ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించాడు. భారత బౌలర్ల పట్ల, ముఖ్యంగా అశ్విన్ లాంటి అనుభవజ్ఞుల పట్ల హెడ్ నిర్భయ విధానాన్ని మెచ్చుకున్నాడు.
శ్రీకాంత్ మాటల్లో.. "ఓ బ్యాటర్ 140 పరుగులు చేశాడు. అతనికి క్రెడిట్ ఇవ్వాలి. అతని నాక్‌ను మెచ్చుకోవాలి. అలా చేయాల్సింది పోయి అగౌరవపరిచే రీతిలో సెండ్ ఆఫ్ ఇస్తావా..? నువ్వు హెడ్‌ను సున్నా పరుగులకో లేక పది పరుగులకో ఔట్ చేసి ఉంటే అది వేరే విషయం.
నువ్వు ఏదో ప్లాన్ చేసి అతని వికెట్ తీసినట్లు సంబురపడిపోయావు. అతను నీ బౌలింగ్‌ను ఎడాపెడా వాయించిన విషయం ఎలా మరిచిపోతావు..? హెడ్ విరుచుకుపడుతుంటే ఏ ఒక్క భారత బౌలర్ దగ్గర సమాధానం లేదు. అతను ఇష్టారీతిన సిక్సర్లు కొట్టాడు. అతను అశ్విన్ అసలు స్పిన్నర్‌గా గుర్తించలేదు. వికెట్లు వదిలి ముందుకు వచ్చి అలవోకగా సిక్సర్లు బాదాడు"
Comments
Please login to add a commentAdd a comment