కాన్‌బెర్రా: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నుంచి వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ అర్థాంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. పాబ్లో కార్రెనో బుస్టాతో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్‌లో జొకోవిచ్ సహనం కోల్పోయాడు. తొలి సెట్‌లో 5-6తో వెనుకబడి ఉన్న సమయంలో జొకోవిచ్ అసహనానికి గురయ్యాడు. వరుసగా మూడు సెట్ పాయింట్లను కోల్పోవడంతో బంతిని తీసుకుని మహిళా లైన్ జడ్జిపై కొట్టాడు. అది ఆమెకు బలంగా తగలడంతో విలవిల్లాడిపోయింది. ఈ అనూహ్య పరిణామంతో జొకోవిచ్ యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఉద్ధేశ్యపూర్వకంగా ఆమెను కొట్టకపోయినా.. లైన్ జడ్జ్‌ను గాయపరిచినందుకు గానూ గేమ్ రూల్స్ ప్రకారం కోర్టును వీడాల్సి వచ్చింది. దాంతో ఈ యూఎస్ ఓపెన్‌లో ఇప్పటివరకూ సాధించిన రేటింగ్ పాయింట్లను సైతం జొకోవిచ్ కోల్పోయాడు. (చదవండి: ఒక్క దెబ్బతో జొకోవిచ్ ఔట్)
అయితే జొకోవిచ్ చర్యను ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ తీవ్రంగా తప్పుబట్టాడు. జోకర్(జొకోవిచ్ ముద్దుపేరు)పై విమర్శలు గుప్తిస్తూనే ఇదే పనిని తాను చేసి ఉంటే ఎన్నేళ్లు శిక్ష విధించేవారో చెప్పాలంటూ ట్వీటర్ వేదికగా ధ్వజమెత్తాడు. జొకోవిచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పరోక్షంగా డిమాండ్ చేస్తూనే అదే తాను చేసే ఉంటే శిక్ష తీవ్రంగా ఉండేదన్నాడు. ఇదే పనిని తాను చేసి ఉంటే 5,10, 20 ఏళ్లలో ఎంతకాలం నిషేధం పడేదని నెటిజన్లను ప్రశ్నించాడు. ఇది ప్రస్తుతంగా వైరల్‌గా మారింది. ‘జొకోవిచ్ చేసిన దానికి నిన్ను ఎత్తి చూపుకోవడం తగదు’ అని ఒక నెటిజన్ బదులివ్వగా, ‘ ఇది దురదృష్టకరమైన ఘటన. జొకోవిచ్‌ను దురదృష్టం వెంటాడింది’ అని మరొకరు సమాధానమిచ్చారు.
గతేడాది 16 వారాల నిషేధం
గత సంవత్సరం కిర్గియోస్‌పై 16 వారాల నిషేధం పడింది. సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ రెండో రౌండ్‌లో పరాజయం అనంతరం కిర్గియోస్ అంపైర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చెత్త అంపైర్ అంటూ దుర్భాషలాడుతూ అతని వైపు ఉమ్మేశాడు! మ్యాచ్‌లో అప్పటికే టైమ్ నిబంధనను అతిక్రమించడం, అనుమతి లేకుండా కోర్టును వీడటం, రెండు సార్లు రాకెట్లు విరగ్గొట్టడంవంటి చేసేశాడు. దాంతో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ ఏటీపీ ఏకంగా ఈ ఒక్క మ్యాచ్‌లోనే 9 అభియోగాలు నమోదు చేసింది. అన్నీ కలిపి లక్షా 13 వేల డాలర్లు (సుమారు రూ. 80 లక్షలు) జరిమానాగా విధించింది. అదే సమయంలో 16 వారాల నిషేధాన్ని కూడా విధిస్తూ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment