
France Foot Ball Team Captain: ఫ్రాన్స్ పుట్‌బాల్ జట్టు నూతన కెప్టెన్‌గా పారిస్ సెయింట్-జర్మైన్ క్లబ్ ఫార్వర్డ్ ఆటగాడు కైలియన్ ఎంబాపె ఎంపికయ్యాడు. వ్యక్తిగత కోచ్ డిడియర్ డెష్‌చాంప్స్‌తో సంప్రదింపుల తర్వాత ఎంబపే ఫ్రెంచ్ ఫుట్‌బాల్ టీమ్ పగ్గాలు చేపట్టేందుకు అంగీకరించాడు. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్రెంచ్ దినపత్రిక ఇవాళ (మార్చి 21) వెల్లడించింది.
దశాబ్దానికి పైగా ఫ్రాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన లోరిస్ 2022 వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. లోరిస్ ఈ ఏడాది జనవరిలో ఫ్రాన్స్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉండింది. తాజాగా ఎంబపే కెప్టెన్సీ చేపట్టేందుకు అంగీకరించడంతో చాలా రోజుల నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.
మరోవైపు ఫ్రాన్స్ జట్టుకు వైస్ కెప్టెన్ ఎంపిక కూడా జరిగింది. సెంటర్ బ్యాక్ ప్లేయర్ రాఫేల్ వరేన్ స్థానంలో అటాకర్ ఆంటోనియో గ్రెజిమెన్ ఫ్రాన్స్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. వరల్డ్ కప్ ఓటమి నేపథ్యంలోనే రాఫేల్ వరేన్ కూడా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
కాగా, 66 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 24 ఏళ్ల ఎంబాపె.. గత వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఫ్రాన్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్లోనే రెచ్చిపోయిన ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్ సాధించినప్పటికీ ఫ్రాన్స్ గెలవలేకపోయింది. ఫ్రాన్స్ 2018 వరల్డ్‌కప్ సాధించడంలోనూ ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. ఎంబాపె కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ను యూరో 2024 క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్ ప్రత్యర్ధిగా ఆడతాడు.