పొట్టి క్రికెట్ తాజా ప్రపంచకప్ సమరం తుది అంకానికి చేరుకుంది. మరో రెండు నాలుగు రోజుల్లో వరల్డ్‌కప్-2024 టోర్నీకి తెరపడనుంది. ఇప్పటికే గ్రూప్-1 నుంచి టీమిండియా, అఫ్గనిస్తాన్.. అదే విధంగా గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా- అఫ్గనిస్తాన్ ట్రినిడాడ్ వేదికగా.. రెండో సెమీ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ గయానా వేదికగా తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం గురువారమే జరుగనున్నాయి.
తొలి మ్యాచ్ ఉదయం ఆరు గంటలకు ప్రారంభం కానుండగా.. రిజర్వ్ డే కూడా ఉంది. ఇక రెండో సెమీ ఫైనల్ రాత్రి ఎనిమిది గంటలకు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌కు మాత్రం రిజర్వ్ డే లేదు.
కాగా చాలా మంది మాజీ క్రికెటర్లు ఊహించినట్లుగానే ఈసారి టీమిండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరగా.. అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ కూడా రేసులోకి దూసుకువచ్చింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.
ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టీ20 ప్రపంచకప్-2024 ఫైనలిస్టులను అంచనా వేస్తూ.. ‘‘ఈసారి వాళ్లు కూడా ఫైనల్‌కు వస్తారనే అనిపిస్తోంది.
ఏదేమైనా టీమిండియానే ట్రోఫీ గెలుస్తుంది’’ అని పేర్కొన్నాడు. అఫ్గనిస్తాన్ జట్టును ఉద్దేశించి భజ్జీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరులో భారత్‌తో అఫ్గన్ తలపడే అవకాశం ఉందని.. రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో గెలుస్తుందని తన అభిప్రాయం వెల్లడించాడు.
కాగా జూన్ 29న వరల్డ్‌కప్-2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో గల కెన్సింగ్‌టన్ ఓవల్ మైదానం ఇందుకు వేదిక.
Comments
Please login to add a commentAdd a comment