ఊరించి... ఉసూరుమనిపించి | Lakshya Sen loses badminton bronze medal match to Lee Zii Jia | Sakshi
Sakshi News home page

ఊరించి... ఉసూరుమనిపించి

Published Tue, Aug 6 2024 7:17 AM | Last Updated on Tue, Aug 6 2024 8:46 AM

Lakshya Sen loses badminton bronze medal match to Lee Zii Jia

రెండు కాంస్య పతకాలను చేజార్చుకున్న భారత క్రీడాకారులు

బ్యాడ్మింటన్‌లో ఓడిన లక్ష్య సేన్‌

షూటింగ్‌ స్కీట్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో ఒక్క పాయింట్‌తో ఓటమి పాలైన  అనంత్‌జీత్‌–మహేశ్వరి జోడీ

రెజ్లింగ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లో చివరి నిమిషంలో తడబడిన నిషా  

ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలంటే అపార నైపుణ్యంతోపాటు, చెక్కు చెదరని విశ్వాసం, మానసిక దృఢత్వం కలిగి ఉండాలి. లేదంటే కచ్చితంగా మెడలో పతకం వేసుకోవాల్సిన చోట... కీలకదశలో ఒత్తిడికిలోనై... అనవసరపు ఆందోళనతో తడబడి... ప్రత్యరి్థకి పతకాలు అప్పగించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రెండు కాంస్య పతకాల వేటలో బరిలోకి దిగిన మనోళ్లు ముందుగా ఊరించి చివరికొచ్చేసరికి ఉసూరుమనిపించారు. బ్యాడ్మింటన్‌లో లక్ష్య సేన్‌... షూటింగ్‌లో మహేశ్వరి–అనంత్‌జీత్‌ జోడీ మంచి అవకాశాలను వదులుకున్నారు. ఫలితంగా రెండు పతకాలు రావాల్సిన చోట ఒక్క పతకమూ దక్కలేదు. ఇక మహిళల రెజ్లింగ్‌ 68 కేజీల విభాగంలో నిషా దహియా అయితే చివరి నిమిషంలో ఏకంగా తొమ్మిది పాయింట్లు సమర్పించుకొని ఓటమిని మూటగట్టుకుంది.  

పారిస్‌: ఒలింపిక్స్‌ పురుషుల బ్యాడ్మింటన్‌లో పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించే అవకాశాన్ని లక్ష్య సేన్‌ వదులుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ కాంస్య పతక మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 21–13, 16–21, 11–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ తొలి గేమ్‌ గెల్చుకున్నప్పటికీ అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. లక్ష్య సేన్‌ ఓటమితో 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ తర్వాత బ్యాడ్మింటన్‌లో పతకం లేకుండానే భారత క్రీడాకారులు ఇంటిముఖం పట్టారు. 2012 లండన్‌లో సైనా నెహా్వల్‌ కాంస్యం సాధించగా... 2016 రియోలో పీవీ సింధు రజతం, 2020 టోక్యోలో పీవీ సింధు కాంస్యం గెలిచారు. 

ఈసారి పురుషుల డబుల్స్‌లో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీపై భారీ అంచనాలు ఉన్నా వారు క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. లీ జి జియాతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ శుభారంభం చేశాడు. దూకుడుగా ఆడుతూ తొలి గేమ్‌ను అలవోకగా దక్కించుకున్నాడు. రెండో గేమ్‌ ఆరంభంలోనూ లక్ష్య తన ఆధిపత్యం చాటుకొని 8–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో లక్ష్య సేన్‌ ఒక్కసారిగా గాడి తప్పాడు. వరుసగా తొమ్మిది పాయింట్లు సమరి్పంచుకున్నాడు. ఇక్కడి నుంచి లీ జి జియా జోరు మొదలైంది. 3–8తో వెనుకబడిన లీ జి జియా 12–8తో ఆధిక్యంలోకి వచ్చి చివరకు 21–16తో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. 

నిర్ణాయక మూడో గేమ్‌లో లీ జి జియా పూర్తి ఆధిపత్యం కనబరిచి 9–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కూడా మలేసియా ప్లేయర్‌ ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆడటంతో లక్ష్య సేన్‌ కోలుకోలేకపోయాడు.  పురుషుల సింగిల్స్‌ విభాగంలో విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌) తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అక్సెల్‌సన్‌ 21–11, 21–11తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ వితిద్‌సర్న్‌ కున్లావత్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా) 21–13, 21–16తో హి బింగ్‌జియావో (చైనా)పై విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.  


ఫినిషింగ్‌ ‘గురి’ తప్పింది... 
షూటింగ్‌ పోటీల చివరిరోజు భారత్‌కు మరో పతకం వచ్చే అవకాశాలు కనిపించాయి. ఒలింపిక్స్‌లో తొలిసారి మెడల్‌ ఈవెంట్‌గా ప్రవేశపెట్టిన స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మహేశ్వరి చౌహాన్‌–అనంత్‌జీత్‌ నరూకా జోడీ 
కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో మహేశ్వరి–అనంత్‌జీత్‌ ద్వయం 43–44 పాయింట్లతో జియాంగ్‌ యిటింగ్‌–జియాన్లిన్‌ లియు (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. ఒక్క పాయింట్‌ తేడాతో భారత జోడీకి కాంస్య పతకం చేజారడం గమనార్హం. ముందుగా 15 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో మహేశ్వరి–అనంత్‌జీత్‌.. జియాంగ్‌ యిటింగ్‌–జియాన్లిన్‌ (చైనా) జోడీలు 146 పాయింట్ల చొప్పున సాధించి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి కాంస్య పతక మ్యాచ్‌కు అర్హత సాధించింది. డయానా బకోసి–గాబ్రియెలా రొసెట్టి జోడీ (ఇటలీ; 149 పాయింట్లు), ఆస్టిన్‌ జెవెల్‌–విన్సెంట్‌ హాన్‌కాక్‌ ద్వయం (అమెరికా; 148 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ–రజత పతక మ్యాచ్‌కు అర్హత పొందాయి. ఫైనల్లో డయానా–రొసెట్టి ద్వయం 45–44తో జెవెల్‌–హాన్‌కాక్‌ జంటను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. 

చివరి నిమిషంలో ‘పట్టు’ కోల్పోయి... 
మహిళల రెజ్లింగ్‌ 68 కేజీల విభాగంలో భారత రెజ్లర్‌ నిషా దహియా క్వార్టర్‌ ఫైనల్లో 8–10 పాయింట్ల తేడాతో పాక్‌ సోల్‌ గుమ్‌ (ఉత్తర కొరియా) చేతిలో ఓడిపోయింది. బౌట్‌ ముగియడానికి ఒక నిమిషం ఉన్నంతవరకు నిషా 8–1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆఖరి 60 సెకన్లలో నిషా పట్టు కోల్పోయింది. ఉత్తర కొరియా రెజ్లర్‌ ధాటికి నిషా తొమ్మిది పాయింట్లు కోల్పోయి ఓటమి పాలైంది. అంతకుముందు నిషా తొలి రౌండ్‌లో 6–4తో తెతియానా సొవా (ఉక్రెయిన్‌)పై గెలిచింది. ఒకవేళ ఉత్తర కొరియా రెజ్లర్‌ ఫైనల్‌ చేరుకుంటే నిషాకు ‘రెపిచాజ్‌’ పద్ధతిలో కాంస్య పతకం సాధించే అవకాశం లభిస్తుంది.  

3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ ఫైనల్లో అవినాశ్‌ 
పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్‌ అవినాశ్‌ సాబ్లే ఫైనల్‌కు అర్హత సాధించాడు. రెండో హీట్‌లో అవినాశ్‌ 8 నిమిషాల 15.43 సెకన్లలో గమ్యానికి చేరి ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. 12 మంది అథ్లెట్స్‌తో కూడిన మూడు గ్రూప్‌లకు హీట్స్‌ నిర్వహించారు. మూడు గ్రూపుల్లో టాప్‌–5 నిలిచిన వారు ఫైనల్‌కు చేరారు. గురువారం రాత్రి ఫైనల్‌ జరుగుతుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement