చైనా ఓపెన్‌లో భారత షట్లర్లకు భారీ షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లోనే ఏకంగా ముగ్గురు ఇంటిముఖం పట్టారు. వీరిలో స్టార్ షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, ప్రియాన్షు రజావత్ ఉన్నారు.
ప్రపంచ ఆరో ర్యాంకర్ ప్రణయ్‌కు మలేసియా ఆటగాడు, వరల్డ్ నంబర్ 22 ప్లేయర్ జీ యంగ్ చేతిలో పరాభవం (21-12, 13-21, 21-18) ఎదురవగా.. లక్ష్యసేన్‌ను డెన్మార్క్ ఆటగాడు, వరల్డ్ నంబర్ 10 షట్లర్ ఆండర్స్ ఆంటన్సన్ 23-21, 16-21, 21-9 తేడాతో ఓడించాడు.
గతేడాది జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించి జోరు మీదున్న ప్రణయ్‌ను జీ యంగ్ 66 నిమిషాల్లో ఓడించగా.. లక్ష్యసేన్‌ను ఆంటన్సన్ 78 నిమిషాల్లో మట్టికరిపించాడు.
అంతకుముందు ప్రియాన్షు రజావత్‌ను ఇండొనేసియాకు చెందిన షెసర్ హిరెన్ వరుస సెట్లలో (21-13, 26-24) ఓడించాడు. మరోవైపు ఈ టోర్నీలో పాల్గొంటున్న ఏకైక భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ కూడా ఇంటీబాట పట్టారు. ఈ జోడీ చైనా టాప్ సీడ్ పెయిర్ చెన్ కింగ్ చెన్-జియా ఇ ఫాన్ చేతిలో 18-21, 11-21 వరుస సెట్లలో ఓటమిపాలైంది.
పురుషుల డబుల్స్ విభాగంలో అర్జున్-దృవ్ కపిల (భారత్) జోడీ.. జపాన్ ద్వయం కెయ్‌చిరో మట్సుయ్-యోషినోరి టెకుచీ చేతిలో పోరాడి ఓడింది (23-21, 21-19). కాగా, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీ నుంచి నిన్ననే నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment