లెక్‌లెర్క్‌ జోరు... | Leclerc wins US GP in Ferrari one-two | Sakshi
Sakshi News home page

లెక్‌లెర్క్‌ జోరు...

Published Tue, Oct 22 2024 9:01 AM | Last Updated on Tue, Oct 22 2024 11:11 AM

Leclerc wins US GP in Ferrari one-two

ఎఫ్‌1 సీజన్‌లో మూడో విజయం

యూఎస్‌ గ్రాండ్‌ప్రిలో టైటిల్‌ సొంతం

వెర్‌స్టాపెన్‌కు మళ్లీ నిరాశ

తొలి ల్యాప్‌లోనే హామిల్టన్‌ అవుట్‌   

ఆస్టిన్‌ (టెక్సాస్‌): ఫార్ములావన్‌ తాజా సీజన్‌లోని తొలి 10 రేసుల్లో 7 విజయాలు సాధించిన రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమవుతున్నాడు. గత తొమ్మిది రేసుల్లో వెర్‌స్టాపెన్‌ ఒక్క రేసులోనూ విజయం అందుకోలేకపోయాడు. మరోవైపు ఇతర జట్ల డ్రైవర్లు అనూహ్యంగా పుంజుకొని వెర్‌స్టాపెన్‌కు గట్టి సవాలు విసరుతున్నారు. సీజన్‌లోని 19వ రేసుగా జరిగిన యునైటెడ్‌ స్టేట్స్‌ (యూఎస్‌) గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ విజేతగా నిలిచాడు. 

నిరీ్ణత 56 ల్యాప్‌లను లెర్‌లెర్క్‌ అందరికంటే వేగంగా అందరికంటే ముందుగా ఒక గంట 35 నిమిషాల 09.639 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లోని లెక్‌లెర్క్‌కిది మూడో విజయం కావడం విశేషం. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసు మొదలుపెట్టిన లాండో నోరిస్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ జట్టుకే చెందిన కార్లోస్‌ సెయింజ్‌ రెండో స్థానాన్ని సంపాదించాడు. డిఫెండింగ్‌ ప్రపంచ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌కు మూడో స్థానం లభించింది. వాస్తవానికి నోరిస్‌ మూడో స్థానంలో నిలిచాడు. అయితే రేసు చివరి దశలో నోరిస్‌ ట్రాక్‌ బయటకు వచ్చాడు. 

దాంతో నిర్వాహకులు అతనిపై ఐదు సెకన్ల పెనాల్టీని విధించారు. దాంతో నాలుగో స్థానంలో నిలిచిన వెర్‌స్టాపెన్‌కు మూడో స్థానం ఖరారు కాగా... మూడోస్థానం పొందిన నోరిస్‌ నాలుగో స్థానానికి పడిపోయాడు. ప్రపంచ మాజీ చాంపియన్, మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌కు ఈ రేసులో నిరాశ ఎదురైంది. హామిల్టన్‌ తొలి ల్యాప్‌లోనే రేసు నుంచి వైదొలిగాడు. సీజన్‌లోని తదుపరి రేసు మెక్సికో గ్రాండ్‌ప్రి ఈనెల 27న జరుగుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 19 రేసులు ముగిశాయి. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌; 354 పాయింట్లు), నోరిస్‌ (మెక్‌లారెన్‌; 297 పాయింట్లు), లెక్‌లెర్క్‌ (ఫెరారీ; 275 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement